అమరావతి : ఇటీవల తరచుగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను ఎలా నివారించాలన్న అంశంపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో మంగళవారం సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్మీడియట్ కమీషనర్ బి. ఉదయలక్ష్మీతోపాటు ఉన్నతాధికారులతో మంగళవారం ఉదయం ఆయన సమావేశమయ్యారు. తరచూ విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు జరుగుతుండటం చాలా బాధిస్తోందని, దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలన్నారు.
విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై గతంలో ఇచ్చిన చక్రపాణి కమిటీ సిఫార్సుల అమలుపైనా చర్చించారు. వీటికి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ కూడా ఇచ్చినప్పటికీ కళాశాలల యాజమాన్యాలు అవి సరిగా పాటించడం లేదన్న విషయాన్ని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. కళాశాలల యాజమాన్యాలతో ఈ నెల 16న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. స్పష్టమైన ఆదేశాలను కళాశాలలకు ఈ సమావేశంలో మంత్రి గంటా ఇవ్వనున్నారు.
ఒత్తిడి లేని విద్యను అందించడం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు, మానసిక హెల్త్ చెకప్‌లు, కౌన్సిలింగ్ తదితర అంశాలు కళాశాలు తప్పనిసరిగా పాటించాలని చక్రపాణి కమిటీ సిఫార్సుల చేసింది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా తరచూ తరగతులు మార్చడం, విద్యార్థుల మార్కులు నోటీసు బోర్డులో వుంచడం వంటి అంశాలు విద్యార్థులు న్యూనత భావానికి లోనయ్యేలా చేస్తున్నాయని కమిటీ తెలిపింది. వీటికి అడ్డుకట్ట వేసేలా గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశ పెట్టే అంశంపైనా మంత్రి గంటా చర్చించారు.