అమరావతి; రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. ఉద్యోగుల వేతనాలు పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ. 9 కోట్ల 26 లక్షలు భారం పడుతుందన్నారు. గురువారం సచివాలయంలో మంత్రి నక్కా ఆనందబాబు విలేకర్లతో మాట్లాడారు. జీతాల పెంపు వల్ల ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 1112 మంది లబ్ది పొందనున్నారని అన్నారు. పెంచిన జీతాల వివరాలు ఇలా ఉన్నాయి.
పీజీ క్వాలిఫికేషన్ ఉన్న సబ్జెక్ట్ టీచర్స్‌కి ప్రస్తుతం రూ.16050 ఇస్తుండగా రూ.24,225కి పెంచుతున్నామని చెప్పారు. పీజీ క్వాలిఫికేషన్ లేని టీచర్స్ జీతాలు రూ. 14,860 నుంచి రూ.22,290కి, పీఈటీ, క్రాప్ట్, ఆర్ట్, మ్యూజిక్ టీచర్స్ జీతాలు రూ. 10,900 నుంచి రూ.16,950కి, లైబ్రెరియన్ జీతం రూ.13,660 నుంచి రూ.20,490కి, క్వాలిఫైడ్ స్టాఫ్ నర్స్ జీతం రూ. 11,530 నుంచి రూ.17,295కి నాన్ క్వాలిఫైడ్ స్టాప్ నర్స్ జీతం రూ. 9,200 నుంచి రూ. 13,800కి పెంచడం జరిగిందన్నారు.
దళిత, గిరిజన విద్యార్ధులు ఉన్నతస్థాయికి ఎదగడానికి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. క్రీడల్లో కూడా రెసిడెన్షియల్ విద్యార్ధులు ఉన్నతస్థాయికి చేరుకోవడానికి కృషి చేస్తున్నామని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్ధులకు సన్న బియ్యం పెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు ఈ విలేకర్ల సమావేశంలో శాసనమండలి సభ్యుడు అన్నం సతీష్ కూడా పాల్గొన్నారు.