ఏపీలో ఇపుడు పి.ఆర్.సి. యుద్ధం తార స్థాయికి చేరుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డితో చర్చల అనంతరం, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటా అని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకు హఠాత్తుగా జీవోలు విడుదల అయ్యాయి. ఇందులో ఐ.ఆర్.తోపాటు హెచ్.ఆర్.ఎ. కూడా తగ్గించేసి, పి.ఆర్.సి.ని ప్రకటించడంతో ఉద్యోగులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. సీఎంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నాయకులను దుమ్మెత్తి పోశారు. దీనితో ఉద్యోగ సంఘాలు పి.ఆర్.సి. జీవో రద్దుకు డిమాండు చేస్తూ నిరసనలు తెలుపుతున్నాయి.
ఈ దశలో తగ్గించిన పి.ఆర్.సి. తో ప్రభుత్వం జీతాలు ఇచ్చేందుకు చేసే ప్రయత్నం బెడిసికొట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు నిరాకరించారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు జీవోలు జారీ చేసింది. ఈజీవోల ప్రకారం ఈనెల 25లోగా వేతనాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ట్రెజరీ అధికారులను ఆదేశించింది.
అయితే తాము కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలను ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ అధికారులు, డ్రాయింగ్ అధికారులు నిరాకరించారు. తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని వారు అంటున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లిస్తూ, జీతం పెరిగినట్లు బిల్లులు చేయడానికి వీరు నిరాకరిస్తున్నారు. దీనితో సీఎం జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.