2023 మార్చి నాటికి అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్.. సీఎం జగన్
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (09:51 IST)
కరోనా వైరస్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి ఇది సదవకాశం. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 2023 మార్చి నాటికి అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని, ఏ స్పీడ్ కనెక్షన్ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
అలాగే అన్ని గ్రామాల్లో సదుపాయాలతో కూడిన డిజిటల్ లైబ్రరీలు ఉండాలన్నారు. సొంత ఊళ్లలోనే వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తామని, నిర్ణీత వ్యవధిలో ఈ పనులన్నీ పూర్తి కావాలని సీఎం చెప్పారు.
గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్, అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్ పంపిణీ అంశాలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వడంతో పాటు మార్గనిర్దేశం చేశారు సీఎం జగన్.
'వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండాలి. రాష్ట్రంలోని తుపాను ప్రభావిత 108 గ్రామాల్లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయాలి. వచ్చే(2022) ఏడాది జనవరి 9న అమ్మఒడి పథకం అమలు చేస్తాం. అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లు కోరుకున్న వారందరికీ అదే రోజున వాటిని అందజేయాలి.
9 నుంచి 12వ తరగతి వరకు గల విద్యార్థులకు ల్యాప్‌టాప్ ఆప్షన్ ఉంది. ల్యాప్‌టాప్ సర్వీసు కూడా పక్కాగా ఉండాలి. అవి చెడిపోతే గ్రామ సచివాలయంలో ఇవ్వాలి. సచివాలయం సిబ్బంది వాటిని సర్వీస్ సెంటర్‌కు పంపి మరమ్మతుల చేయించాలి. వారంలోపే ల్యాప్‌టాప్ తిరిగి తెప్పించాలి.
బిల్ ఫైనల్ చేసేటప్పుడు గ్యారెంటీ, వారంటీ, సర్వీస్‌పై దృష్టి పెట్టాలి. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ల్యాప్‌టాప్ సర్వీస్ సెంటర్లు ఉండాలి'' అని అధికారులకు దిశా నిర్దేశం చేశారు సీఎం జగన్.