ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక

ఠాగూర్

సోమవారం, 20 అక్టోబరు 2025 (12:40 IST)
దీపావళి పండుగ సంర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఓ శుభవార్త చెప్పింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో దీపావళి పండుగ ఆనందం రెట్టింపుకానుంది.
 
ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు... డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లతో పాటు ఇతర కేడర్లలోని ఉద్యోగులకు త్వరలోనే పదోన్నతలు కల్పించనున్నారు. గతంలో వారిపై నమోదైన క్రమశిక్షణా చర్యలు, శిక్షలు లేదా పెనాల్టీలతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకముందు ఇదే విధానం అమల్లో ఉండేది. 
 
2020లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వర్తించే నిబంధనలనే ఆర్టీసీ సిబ్బందికి  కూడా అమలు చేశారు. దీంతో పదోన్నతుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పాత విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వ సంఘాలు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
 
ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు పాత పద్దతిలోనే పదోన్నతులు కల్పించేందుకు పచ్చజెండా ఊపారు. ఈ మేరకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తమకు నిజమైన దీపావళి కానుకగా వారు అభివర్ణిస్తున్నారు. ే

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు