500 ఎకరాలు కొనుగోలు చేసిన బాలకృష్ణ... అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్

ఆదివారం, 28 జులై 2019 (11:17 IST)
సినీ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకే అమరావతిలో వందలాది ఎకరాలను తన పేరిట కొనుగోలు చేశారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. రాష్ట్ర విభజన తర్వాత, రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే ఈ లావాదేవీలన్నీ జరిగినట్టు ఆ పత్రికా కథనం పేర్కొంది. అంటే అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు ఆ పత్రికా కథనం పేర్కొంది. 
 
అమరావతి ప్రాంతాన్ని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించక ముందే ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, మంత్రులు నారాయణ, నటుడు మురళీ మోహన్ హెరిటేజ్ సంస్థ వందల ఎకరాలను కొనుగోలు చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 'గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని ఉంటుందని ప్రకటించక ముందే బాలకృష్ణ, తన బంధువుతో కలిసి 500 ఎకరాలను కొనుగోలు చేశారు. తెలుగుదేశం నేతలు ఎంతో మంది ఈ ప్రాంతంలో భూములను ముందే కొన్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి' అని వైకాపా నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంగ్లపత్రిక ఈ సంచలన కథనాన్ని ప్రచురించడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను బయటకు తెస్తామని ప్రకటించారు. అమరావతిలో భూసమీకరణ ఓ అతిపెద్ద స్కామ్ అని, తెలుగుదేశం నేతలు రహస్య ప్రమాణాన్ని మీరారని ఆయన ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు సైతం ఈ విషయాలను గమనించిన తర్వాతనే రాజధాని నిర్మాణానికి నిధులను ఇచ్చేది లేదని తేల్చి చెప్పిందని బొత్స గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు