జమ్మూకాశ్మీర్‌లో తెలుగు జవాన్ వీర మరణం

శుక్రవారం, 9 జులై 2021 (10:48 IST)
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులు మరోమారు పెట్రోగిపోయారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ జవాను మనుప్రోలు జశ్వంత్‌ రెడ్డి (23) వీరమరణం పొందాడు. 
 
రాజౌరీ జిల్లాలోని సుందర్‌బాని సెక్టారులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే, ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందినట్టు ఆర్మీ అధికారులు ఈ ఉదయం ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 
 
ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శుక్రవారం రాత్రికి జశ్వంత్ మృతదేహం బాపట్లకు చేరుకునే అవకాశం ఉంది. కాగా, జశ్వంత్‌రెడ్డి 2016లో మద్రాసు రెజిమెంట్‌లో సైన్యంలో చేరాడు. 
 
తొలుత నీలగిరిలో పనిచేసిన జశ్వంత్ ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. మరో నెల రోజుల్లో కుమారుడికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే అతడు అమరుడైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు