తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరునున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ నాయకులు మెల్లగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం మొదలుపెట్టారు. తాజాగా వైసీపి నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ మానసిక పరిస్థితి సరిగా లేదన్నారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదని విమర్శించారు.
రాజకీయాలపై పరిపక్వత లేనివాళ్లు పవన్ కల్యాణ్‌లా మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకుడు చెప్పే మాటలను ప్రజలు ఎలా విశ్వసిస్తారంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడా పవన్ కల్యాణ్ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ మోహన్ రెడ్డి తన పని తను చేసుకుని పోతుంటే మధ్యలో పవన్ కల్యాణ్‌కు ఎందుకు? అసెంబ్లీకి ఎందుకు వెళ్లడంలేదు అని ప్రశ్నించడం ఎందుకు?
పదేపదే ఇలా విసిగిస్తే ఎవరికైనా కోపం వస్తుందని, అందుకే పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ల గురించి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడి వుంటారని చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద చూస్తుంటే అంతా కలిసి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తున్నట్లు కనబడుతోంది. ఇదంతా చూస్తుంటే ఏపీలో జనసేన పార్టీ బలపడుతుందా అనే అనుమానం కూడా కలుగుతోంది.