బాలకృష్ణ నిజమైన హీరో... తన అత్త కోర్కె మేరకే ఎన్టీఆర్‌... చంద్రబాబు

ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (16:33 IST)
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, తన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. బాలకృష్ణ నిజమైన హీరో అంటూ కితాబిచ్చారు. బాలకృష్ణ అంకితభావంతో ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. బాలకృష్ణ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ పేదల ప్రాణాలు కాపాడే హీరో అని కొనియాడారు.
 
చంద్రబాబు ఆదివారం బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన అత్తగారి కోరి మేరకే ఎన్టీఆర్‌ బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి ప్రారంభానికి పూనుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం కేన్సర్‌తో బాధపడ్డారని.. అప్పట్లో ముంబై, చెన్నై నగరాలకు తీసుకెళ్లి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదన్నారు. బసవతారకం ఆస్పత్రి కోసం తనతో పాటు అనేక మంది ఎన్నారైలు, తెలుగు పెద్దలు సహకారం అందించారన్నారు. 

వెబ్దునియా పై చదవండి