ప్రతిభావంతుల చదువు బాధ్యత ప్రభుత్వానిదే... వాళ్లే ఆస్తి... సీఎం చంద్రబాబు నాయుడు

బుధవారం, 24 మే 2017 (20:25 IST)
అమరావతి : చదువుకోవాలన్న తపన ఉండి.. ప్రతిభ చూపే విద్యార్ధులకు తమ ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని.. అలాంటి విద్యార్ధుల ఉన్నత చదువుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇంటర్మీడియట్‌, ఎంసెట్‌లలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లి దండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా  విద్యార్థులు తమ అనుభవాలను, లక్ష్యాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విద్యార్ధులు అపజయాన్ని ఎప్పుడూ అంగీకరించకూడదని.. విజయాన్ని ఎలా సాధించాలో నేర్చుకోవాలన్నారు. పేద కుంటుంబాల నుంచి వచ్చినప్పటికీ.. ఉన్న కొద్దిపాటి సదుపాయాలతోనే అనుకున్న లక్ష్యాలను సాధించి.. తల్లిదండ్రులు గర్వపడేలా చేసిన విద్యార్ధుల్ని సీఎం అభినందించారు. ఒక మంచి ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుందని.. అలాంటి ఆలోచనలు చేసేవాళ్లకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 
 
పేదరికం ప్రతిభకు ఎప్పుడూ అడ్డంకి కాకూడదని... కష్టపడి చదివి.. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్ధుల ఉన్నత చదువులకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇక్కడకు వచ్చిన విద్యార్థులకు సమాజ సేవ, సామాజిక బాధ్యత పట్ల లక్ష్యాలు ఉండటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రానికి పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు వస్తున్నాయని.. వీటిలో 1,66,147 మంది విద్యార్ధులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించనున్నాయని చెప్పారు. ఈ విశ్వవిద్యాలయాలు మొత్తం 16 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. తాను చేస్తున్న ఈ ప్రయత్నం భావితరాల కోసమేనన్నారు. 
 
నాలెడ్జ్ ఎకాడమీకి ప్రాధ్యాన్యం పెరిగిందని, విద్యార్థులు కూడా ఆ దిశగా ఆలోచించాలని కోరారు. తల్లితండ్రులు కూడా తమ బిడ్డలకు ఎంత ఆస్తి ఇచ్చామని ఆలోచించకుండా, వారికి ఎంత మంచి చదువు చెప్పించామన్నది గుర్తించాలన్నారు. ప్రతిభ ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ నాదెళ్ల సత్య, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ల వేతనం ఇప్పుడు కోట్ల రూపాయలు ఉందని, వారు చదువుకోబట్టే ఆ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫిన్‌టెక్ రంగాలకు మంచి భవిష్యత్తు ఉందని చంద్రబాబు తెలిపారు. 
 
రాష్ట్రంలో విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి రాష్ట్రానికి రానున్న ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటి –తిరుపతి, నిట్ – తాడేపల్లి, ఐఏఎమ్ - విశాఖ, ట్రిబుల్ ఐటీ- కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ- అనంతపురం, పెట్రోలియం- విశాఖ, స్పోర్ట్స్- అమరావతి, వాటర్ రిసోర్స్- అమరావతి, లాజిస్టిక్ యూనివర్సిటీ- కాకినాడ వస్తున్నాయన్నారు. విద్యకు బడ్జెట్లో మొత్తం 22 వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. 
 
విద్యార్థులకు 3 వేల కోట్ల రూపాయలు అదనంగా ఉపకార వేతనాలు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన అయోవా సంస్థలు వస్తున్నాయన్నారు. ఈ సంస్థ ఒక పెద్ద సీడ్ పార్క్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. సాంకేతిక రంగంలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. టెస్లా సంస్థ ఇప్పుడు అంతరిక్షంలోకి ప్రయోగించిన రాకెట్లు తిరిగి ప్రయోగించిన ప్రాంతంలోనే సురక్షితంగా దిగేలా ప్రయోగం చేస్తున్నారని, ఈ తరహా ప్రయోగం ప్రపంచంలోనే మొదటిది కానుందనన్నారు. ఆ సంస్థ నాసాతో కలసి మార్స్ గ్రహం పైన మానవులు నివాసం ఉండేలా అక్కడికి మనుషులను పంపించే ప్రయోగం చేస్తోందని వివరించారు. 
 
రాష్ట్రంలోనే విద్యావిధానంలో పలు మార్పులు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కొన్ని విద్యా సంస్థల్లో ప్రమాణాలు పాటించడం లేదని అలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఇప్పటికే అలాంటి 240 జూనియర్ కళాశాలలను రద్దు చేశామని, మరో 804 కళాశాలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన 158 మంది విద్యార్ధుల్లో జేఈఈ మెయిన్స్‌కు ముగ్గురు, ఇంజినీరింగ్ -20, ఇంటర్ మొదటి సంవత్సరం-50, రెండో సంవత్సరం-50 మంది, సోషల్ వెల్ఫేర్ -7, ట్రైబుల్ వెల్ఫైర్ -8, ఇతర విద్యార్థులు -20 మంది హాజరయ్యారు. ర్యాంకులు సాంధించిన విద్యార్థులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఎంపీసీలో మొదటి రాంక్ సాధించిన షేక్ షర్మిల మాట్లాడుతూ సీఎంని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తనకు బిట్స్ పిలానీలో చదువుకోవాలని ఉందని తమది పేద కుటుంబమని చదువుకు సాయం చేయాలని కోరారు. దానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ ఆమె చదువుకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అలాగే బైపీసీలో మొదటి ర్యాంకర్ ఆలపాటి నైమిశ, సీఈసీ మొదటి ర్యాంకర్ అబ్దుల్ ఖయ్యుం, జేఈఈ ర్యాంకర్ ప్రకాష్ రెడ్డి, సీఈసీ రెండో ర్యాంకర్ పల్లవి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్రా కళాశాల విద్య, సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఉన్నత విద్యామండలి విజయ్ రాజ్, సాంకేతిక విద్య కమిషనర్ ఉదయలక్ష్మి, ఉన్నతాధికారులు, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి