నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోటోలను పీకిపారేశారు. అలాగే, ఆయా శాఖల ఛాంబర్ల వద్ద ఉన్న మంత్రుల పేరు పలకలను కూడా తొలగించారు.
ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైకాపా 151 సీట్లతో విజయభేరీ మోగించింది. దీంతో ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయడం, దానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆమోదముద్ర వేయడం అగమేఘాలపై జరిగిపోయింది. ఫలితంగా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా మారిపోయారు. ఆయన సారథ్యంలోని మంత్రివర్గం కూడా రద్దు అయింది.
దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే, జగన్ సారథ్యంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికేందుకు అమరావతిలోని సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.
చంద్రబాబు రాజీనామాతో, తెదేపా ప్రభుత్వం రద్దు కాగా, సచివాలయంలోని మంత్రుల చాంబర్ల ముందున్న నేమ్ ప్లేట్స్, చాంబర్లలోని చంద్రబాబు ఫోటోలను తొలగించాలని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశించింది. దీంతో అధికారులు వాటిని శరవేగంగా తొలగించేశారు. జీఏడీ ఆదేశాలతో అన్ని గదుల ముందున్న నేమ్ ప్లేట్స్, చంద్రబాబు, ఎన్టీఆర్‌ల చిత్ర పటాలను తొలగించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతనంగా వచ్చే మంత్రుల పేర్లతో నేమ్ ప్లేట్స్ రాయిస్తామని అధికారులు వెల్లడించారు.