కోవిడ్ 19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం ఆయుర్వేద ఔషధంపై చర్చించారు.
కృష్ణపట్నం మందుపై సవీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్ జగన్‌కు వివరాలు అందించారు రాష్ట్ర ఆయుష్ కమిషన్. అందులో ఆయన ఇలా పేర్కొన్నారు. కృష్ణపట్నంలో ఆనందయ్య 30–35 సంవత్సరాలుగా మందును ఇస్తున్నారు. నోటి ద్వారా నాలుగు రకాల మందులు, కళ్లలో డ్రాప్స్ ఇలా ఐదు రకాలుగా మందులు ఇస్తున్నారు. ఆయన 18 రకాల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారు.
పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె ఇలా 18 రకాల పదార్థాలను ఆనందయ్య 5 రకాల మందుల్లో వాడుతున్నారు. అన్నీ కూడా సహజంగా దొరికే పదార్థాలు. వేరే ఏ ఇతర పదార్థాలను ఆయన వాడడం లేదు. మందుల తయారీ విధానాన్ని మొత్తం మాకు చూపించారు. ఫార్ములా కూడా చెప్పారు. ఆ మందుల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపాం.
కొన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చాయి, ఇంకా కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఇంకా ఈ మందు శాంపిళ్లను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ స్టడీస్ (సీసీఆర్‌ఏఎస్)కు పంపామన్నారు ఆయుష్ కమిషనర్. వాళ్లు 500 మందికి ఇచ్చి వారి నుంచి పూర్తి స్థాయి పరిశీలన చేస్తున్నారని వెల్లడించారు.