అపుడు ముద్దుల ప్రియుడు.. ఇపుడు గుద్దుల ప్రియుడు : జగన్‌పై ఆర్ఆర్ఆర్ సెటైర్లు

ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (16:55 IST)
ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు వేశారు. అపుడు ముద్దుల ప్రియుడు.. ఇపుడు గుద్దుల ప్రియుడు అంటూ విమర్శలు గుప్పించారు. పాదయాత్ర సమయంలో జగన్ కనిపించిన ప్రతి ఒక్కరికీ ముద్దులు పెట్టారని, ఇపుడు అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కటీ పెంచేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం జరుగుతున్న తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఈ నెల 23వ తేదీన శ్రీవారికి సీఎం హోదాలో జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తాను హిందువే అంటూ డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివుంది. కానీ, ఆ డిక్లరేషన్‌పై సీఎం జగన్ సంతకం పెడతారా లేదా అన్నది ఇపుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. 
 
దీనిపై రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, గతంలో గంగాస్నానం చేసినప్పుడు ఎంతోమంది జగన్‌ను నమ్మారని, కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో పక్కన కేవలం బైబిల్ మాత్రమే ఉండడంతో ఆయనపై క్రైస్తవుడు అనే ముద్ర పడిందన్నారు. బైబిల్‌ను పక్కనబెట్టుకోవడంలో తప్పులేదని, ఎవరి విశ్వాసాలు వారివన్నారు. 
 
కానీ, సీఎం జగన్ ఎంతో పాప్యులర్ కాబట్టి ప్రమాణస్వీకారోత్సవాన్ని ఎంతోమంది చూసుంటారని, ఆయన క్రిస్టియన్ అన్న సంగతి అందరికీ తెలిసిందని వివరించారు. "'సీఎం జగన్ ప్రమాణస్వీకారం సందర్భంగా భగవద్గీత, ఖురాన్ కాకుండా బైబిల్ పక్కన ఉంచుకున్నారు. అలాకాకుండా భగవద్గీత, ఖురాన్, బైబిల్ మూడింటిని పక్కన పెట్టుకని ఉంటే మరోలా ఉండేది. ఇప్పుడు మీరు క్రిస్టియన్ అని అందరూ గుర్తించారు. అందుకే మీరు ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టండి.
 
గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు? ఒక్క సంతకమే కదా! పెట్టేయండి! నేను ఈ మతాన్ని గౌరవిస్తున్నాను అంటూ ఒక్క సంతకం పెడితే మీరు సెక్యులర్ అని భావిస్తారు. హిందువుల్లో హృదయాల్లో నిలిచిపోతారు. ఇదేమన్నా అందరికీ సరదానా? అందరూ మిమ్మల్ని ప్రేమించేవాళ్లే. మీరు కూడా అందరినీ ప్రేమిస్తారు. గతంలో పాదయాత్ర సందర్భంగా అవ్వాతాతలపై చూపించిన ప్రేమ, పసిపిల్లలపై చూపించిన అవ్యాజానురాగమైన ప్రేమ ఇంకా ప్రజల్లో అలాగే నిలిచిపోయింది.
 
ఒకవిధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో మీరు చూపిన ప్రేమకు మిమ్మల్ని ముద్దుల ప్రియుడిగా పిలుచుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడున్న కొవిడ్ పరిస్థితుల్లో మీరు బయట పెద్దగా తిరగలేకపోతుండవచ్చు. కానీ బయట జరుగుతున్న పరిణామాలతో మిమ్మల్ని ముద్దుల ప్రియుడికి బదులు గుద్దుల ప్రియుడు అనుకుంటున్నారు. కొందరిపై పోలీసు దాడులు, ఇటీవల ఘటనలతో ఈ దెబ్బలేంట్రా బాబూ అని ప్రజలు బాధపడుతున్నారు. మనకి ఇలాంటి చెడ్డపేరు వద్దు సార్ అంటూ రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు