ఏపీలో తగ్గని కరోనా దూకుడు... నెలాఖరు వరకు లాక్డౌన్ పొడగింపు

సోమవారం, 17 మే 2021 (18:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో 73,749 కరోనా టెస్టులు నిర్వహించగా 18,561 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 3,152 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 2,098 కేసులు, అనంతపురం జిల్లాలో 2,094 కేసులు గుర్తించారు.
 
అదేసమయంలో 17,334 మంది కరోనా నుంచి కోలుకోగా, మరణాల సంఖ్య మాత్రం మరోసారి భారీగా నమోదైంది. గడచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో 109 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 16 మంది కన్నుమూశారు.
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 14,54,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 12,33,017 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,11,554 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 9,481కి పెరిగింది.
 
మరోవైపు, ఏపీలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో క‌ర్ఫ్యూను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ... ఏపీలో క‌ర్ఫ్యూ విధించి 10 రోజులు మాత్ర‌మే అవుతోంద‌ని చెప్పారు. క‌నీసం నాలుగు వారాలు క‌ర్ఫ్యూ ఉంటేనే స‌రైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఆయ‌న తెలిపారు.
 
గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కరోనాతో అనాథ‌లైన పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు చ‌ర్య‌లు తీసు‌కుంటామ‌ని, వారికి ఆర్థిక సాయంపై కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌ని చెప్పారు. కాగా, ఏపీలో క‌ర్ఫ్యూ విధించిన‌ప్ప‌టికీ కొవిడ్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే.
 
అదేసమయంలో కరోనా కట్టడి, సహాయక చర్యలపై వివరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిపారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం, ఏపీసీఎల్ఏ, తోట సురేశ్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితకుమారి బెంచ్ విచారణకు స్వీకరించింది. 
 
ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. ఆక్సిజన్ బెడ్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఏంటని అడిగింది. అందరికీ వ్యాక్సినేషన్ కార్యాచరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యల వివరాలు తెలుసుకుంది. రెమ్ డెసివిర్‌తో పాటు, ఇతర అత్యవసర ఔషధాల లభ్యతపైనా కోర్టు ఆరాతీసింది.
 
సీనియర్ సిటిజన్లు, కొవిడ్ రోగులకు ఇళ్ల వద్దే వ్యాక్సిన్ ఇస్తామన్న కార్యాచరణ ఏమైందని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయో ఈ నెల 19న తెలపాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లో బెడ్లు, కరోనా చికిత్స వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల రోజువారీ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించాలని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు