కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితం: కృష్ణాజిల్లా క‌లెక్ట‌ర్

మంగళవారం, 2 మార్చి 2021 (09:15 IST)
‌కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మూడవ దశ టీకా పంపిణీ ప్రారంభం కావడం జిల్లా ప్రజలకు మంచి శుభవార్త అని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ పేర్కొన్నారు. సోమవారం నుంచి అందరికీ అందుబాటులో వ్యాక్సినేషన్ వచ్చిన సందర్బంలో అందుకు సంబంధించిన వివరాలను జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇంతియాజ్ అవగాహన పరచే సందేశాన్నిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి రెండు విడతల్లో హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టి 42వేల మందికిపైగా వ్యాక్సిన్ అందించడం జరిగిందన్నారు. హెల్త్ కేర్ వర్కర్లకు మొదటి విడత డోస్ వేయడంతో పాటు రెండవ విడత టీకా కార్యక్రమం కూడా సాగుతుందన్నారు.

తాజా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సోమ‌వారం నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభ మైనదన్నారు. అయితే టీకా తీసుకోవాలనుకునేవారు ముందుగా కోవిన్ పోర్టర్ లో తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. కోవిన్ యాప్ ఇప్పటికే విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. 
 
"కోవిన్‌‌”.. నమోదు ఇలా...
www.cowin.gov.in లో పేరు నమోదు చేసుకోవాలన్నారు. వెబ్ సైట్ లోకి వెళ్లిన తరువాత రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అనే బటన్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ వ్రాస్తే ఫోన్‌కు ఒక ఓటిపి నెంబర్ వస్తుందన్నారు. ఆ ఓటిపి నెంబర్ ఎంటర్ చేస్తే రిస్ట్రేషన్ తేదీకి వెళుతుందని అక్కడ మీ పేరు, వయస్సు, పుట్టిన తేది, జండర్ వంటి వివరాలు నమోదు చేయాలన్నారు.

వీటితో పాటు ఆధార్ కార్డు తదితర ఏదైనా ఒక దృవీకరణ పత్రం ఎంచుకొని దానిని అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా 45 నుంచి 60 ఏళ్ల లోపు వారైతే వ్యాధిని నిర్ధారించే డాక్టర్ సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. ఇలా అన్ని వివరాలు నింపిన తరువాత రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేయవలసి ఉంటుందన్నారు.

రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత సంబంధిత వివరాలను చూపడం జరుగుతుందని, తదుపరి ఒక వ్యక్తి ఒక మొబైన్ నెంబరు మీద మరో ముగ్గురు కుటుంబ సభ్యుల వివరాలను జత చేసుకోవచ్చన్నారు. అయితే ఇందుకోసం యాడ్ మోర్ బటన్ ను క్లిక్ చేసుకోవలసి ఉంటుందన్నారు.

తరువాత టీకా పొందడం కోసం అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవలసి ఉంటుందని ఇందుకు షెడ్యూల్డు అపాయింట్ మెంట్ అనే బటన్‌ను క్లిక్ చేస్తే ఆ పేజీకి వెళుతుందన్నారు. అక్కడ మన రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్ ఎంటర్ చేసి మనకు సమీపంలోని టీకా పంపిణీ కేంద్రాలను తెలుసుకోవచ్చన్నారు. ఆ జాబితా నుంచి ఒక కేంద్రాన్ని (కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ) ఎంచుకుంటే అందుబాటులో ఉన్న స్లాట్ చూపిస్తుందన్నారు.

వాటిలో నుంచి సమయం, తేదీని ఎంచుకొని కింద ఉండే బుక్ బటన్ ను క్లిక్ చేస్తే అపాయింట్ మెంట్ లభిస్తుందన్నారు. తొలిడోస్ తీసుకున్న 28 రోజుల తరువాత రెండవ డోస్ తీసుకోవాలన్నారు. మొదటి డోస్ తీసుకున్నప్పుడే రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలో తెలుస్తుందన్నారు. కృష్ణాజిల్లాలో 23 ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీలతో పాటు 7 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా వ్యాక్సిన్ పొందే అవకాశం ఉందన్నారు.

విజయవాడ నగరంలో ఆంధ్రహాస్పల్, సెంటిని హాస్పటల్, అనూ హాస్పటల్, క్యాపిటల్ హాస్పటల్, కామినేని హాస్పటల్, మచిలీపట్నంలో ఆంధ్ర హాస్పటల్, గుడివాడలోని అన్నపూర్ణ ఆసుపత్రుల్లో రూ.250 ఫీజు చెల్లించి వ్యాక్సిన్ పొందవచ్చన్నారు.

ముందుగా కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అదేవిధంగా విజయవాడ జిజిహెచ్, మచిలీపట్నం జిల్లా ఆసుపత్రితో పాటు నూజివీడు, గుడివాడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మరికొన్ని ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా పొందవచ్చన్నారు.

ఇంతవరకు కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూశామని, ఈ రోజు నుంచి అది అందుబాటులోకి రావడం శుభవార్త అన్నారు. నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన కోవిన్ యాప్ లో నమోదు ప్రక్రియను వినియోగించుకోవాలన్నారు.

నమోదు చేసుకొన్న వారికి ఏరోజున, ఏకేంద్రంలో, ఎన్ని గంటలకు టీకావేస్తారు. వివరాలన్నీ స్పష్టంగా తెలియజేయడం జ‌రుగుతుంద‌న్నారు. మనమంతా కలసి కరోనా మహమ్మారిని దేశం, రాష్ట్రం, జిల్లా నుంచి నిర్మూలిద్దామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని దేశాన్ని, రాష్ట్రాన్ని జిల్లాను కరో నారహితం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ఆవశ్యకతను తెలుసుకొని ఎంతో సురక్షితమైన కోవిన్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. తాను కరోనా టీకా మొదటి డోస్ తీసుకున్నానని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు