ప్రపంచ వ్యాప్తంగా కరోనా కుబేరులను సైతం బికారులుగా మారుస్తున్న వేళ ఏపీ లోని విజయవాడలో ఓ టీచర్‌ను రోడ్లపై చెప్పుల వ్యాపారిగా మార్చేసింది. ఉపాధి కరవై రోడ్లపై చెప్పులు అమ్ముకుంటున్న సదరు వ్యక్తిని చాలా రోజుల తర్వాత గుర్తించిన మీడియా ఈ విషయాన్ని వెలుగు లోనికి తీసుకొచ్చింది. నిన్న మొన్నటి వరకు భావి భారత పౌరులను తయారు చేసి, కరోనాతో ఉపాధి కోల్పోయిన గురువును ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.
దీంతో స్పందించిన అధికారులు ఆయనకు ఉపాధి కల్పించేందుకు హామీ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. కరోనా ప్రభావం మొదలయ్యాక ప్రపంచ వ్యాప్తంగా గుండెలు పిండేసిన ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. మానవత్వం కరువవవుతున్న సంఘటనలు నిత్యకృత్యమవుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఎంతో గొప్పగా బ్రతికిన వారు కూడా చితికిపోయి ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.
నగరంలో అంతగా ట్రాఫిక్ లేని బీఆర్ టీఎస్ రోడ్డులో ప్రక్కన గొడుగు క్రింద కూర్చొని వెంకటేశ్వరరావు చెప్పులు అమ్ముకుంటున్నారు. మొదట్లో ఆయన టీచర్ అన్న విషయం వరికీ తెలియదు. ఎప్పటిలాగా ఆయన రోడ్డులో చెప్పులు పరుచుకొని కూర్చోవడం వచ్చి పోయే వారికి చెప్పులు అమ్ముకోవడం జరుగుతూనే ఉంది. కాని ఆయన్ను కొన్ని రోజులుగా గమనిస్తున్న వారు దగ్గరకెళ్లి విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు.