విజయవాడలో కరోనా కలకలం - ఇద్దరు కార్పొరేటర్లకు కరోనా

శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (15:11 IST)
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్, విభాగంలో పలువురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తేలింది. 
 
నగరపాలక సంస్థ తొలి కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇద్దరు కార్పొరేటర్లకు కోవిడ్ పాజిటివ్ రావడంతో కౌన్సిల్ సమావేశం నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ముందస్తుగా కార్పొరేటర్లందరికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. రిజల్ట్ తర్వాత కౌన్సిల్ సమావేశం వాయిదా పై అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 35,741 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5,086 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,42,135 మంది వైరస్‌ బారినపడినట్లు ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు