భాగ్యనగరిలో కరోనా విశ్వరూపం - ఆంధ్రాలో మళ్లీ లాక్డౌన్?
శనివారం, 20 జూన్ 2020 (07:27 IST)
కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ కరోనా వైరస్ కట్టలు తెంచుకుంటోంది. ఫలితంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 499 కొత్త కేసులు నమోదుకాగా, వీటిలో 329 కరోనా కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటం గమనార్హం.
అలాగే, హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలోనూ 129 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 499 కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,526కి పెరిగింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో మూడు మరణాలు సంభవించగా, కరోనా మృతుల సంఖ్య 198కి చేరింది. ప్రస్తుతం 2,976 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు వెలుగుచూస్తున్న ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్డౌన్ ప్రకటించారు.
రాష్ట్రంలో శుక్రవారం ఒక్క రోజే 465 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7,961కి పెరిగింది. తాజా కేసుల్లో ఎక్కువగా కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోనే నమోదయ్యాయి.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో ఇప్పటివరకు 29 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో ఒకే కాలనీకి చెందిన 16 మంది ఉన్నారు. ధర్మవరంలో 34 కేసులు బయటపడ్డాయి. దీంతో అనంతపురంతోపాటు ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్డౌన్ విధిస్తూ కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే, ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 296 కేసులు నమోదయ్యాయి. ఒక్క ఒంగోలులోనే 14 ప్రాంతాల్లో కలిపి 69 కేసులు నమోదు కాగా, చీరాల పరిధిలోనే 46 కేసులు వెలుగుచూశాయి. దీంతో ఒంగోలు, చీరాలలో లాక్డౌన్ విధిస్తున్నట్టు కలెక్టర్ భాస్కర్ పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ నెల 11న జరిగిన ఓ సంస్మరణ సభలో 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి ఆ తర్వాత కరోనా సోకగా, కాశీబుగ్గకు చెందిన ఓ వ్యాపారి కూడా కరోనా బారినపడ్డాడు.
దీంతో ఈ రెండు ప్రాంతాలను కట్టడి ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఈ మేరకు కలెక్టర్ నివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.