వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. ఈసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో నెట్టారు. రాష్ట్ర విభజనపై సొంత పార్టీ టీడీపీపైనే విమర్శలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ మీదనే భారం వుందని.. ఈ పాపంలో టీడీపీకి కూడా వాటా ఉందని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతు కోరుతోంది. రాష్ట్రాన్ని దెబ్బతీయడంలో అందరి పాత్ర ఉన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తే తప్పు లేదని జేసీ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో టీడీపీ లేదని, ఆంధ్రాలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదన్నారు. తెలంగాణలో పొత్తును ఏపీ ప్రజలు హర్షిస్తారని, కానీ ఏపీలో అవసరం లేదని జేసీ వ్యాఖ్యానించారు.
నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడని.. బీజేపీని నమ్మి మోసపోయామని, అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్ అంటోందని జేసీ గుర్తు చేశారు. అలాంటప్పుడు కాంగ్రెస్‌ని నమ్మి చూస్తే తప్పేమీ ఉందంటూ జేసీ వ్యాఖ్యానించారు. అలాగే విభజన పాపం కాంగ్రెస్, టీడీపీల రెండింటిది ఉందని, పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరని జేసీ కామెంట్స్ చేశారు.
పనిలో పనిగా తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలు కావాలనడంలో ఆయన ప్లాన్ ఏంటో జేసీ బయటపెట్టాడు. రాజకీయ కుయుక్తిలో భాగంగానే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు జేసీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్.. బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉందని వివరించారు. ఆ లోపు ఇక్కడ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. ముస్లిం ఓటర్లను కోల్పోకుండా ఉండవచ్చని కేసీఆర్ ప్లాన్ వేశారన్నారు.