అప్పటి ఏపీ హౌసింగ్ బోర్డు, ఇందూ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టు అక్రమాలపై ఈడీ గతేడాది చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అందులో లోపాలు ఉన్నట్టు కోర్టు చెప్పడంతో మళ్లీ పూర్తి వివరాలతో ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేయగా గత నెల 23న విచారణ ప్రారంభమైంది. శుక్రవారం ఇది మరోమారు విచారణకు రాగా వచ్చే నెల 30కి వాయిదా పడింది.
ఈ చార్జిషీటులో ఈడీ మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చగా, అందులో జగన్ పేరు కూడా ఉంది. మిగతా వారిలో ఐ.శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, జితేంద్రమోహన్‌దాస్, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వీవీ కృష్ణ ప్రసాద్, ఇందూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చిడ్కో, ఇందూ ఈస్ట్రన్ ప్రావిన్స్ ప్రాజెక్ట్ ప్రైవేటు లిమిడెట్, ఇందూ రాయల్ హోమ్స్, వసంత ప్రాజెక్ట్స్, ఎంబసీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ ఉన్నాయి. కాగా, ఈ కేసులో ఈడీ ఇప్పటికే రూ. 117కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
మరోవైపు జగన్‌పై నమోదైన కేసుల్లో దాఖలైన అన్ని అభియోగ పత్రాల్లోనూ కనిపించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలిసారి కనిపించలేదు. హౌసింగ్ బోర్డు అక్రమాలపై దాఖలు చేసిన చార్జిషీటులో రెండో నిందితుడిగా ఇప్పటివరకు ఉన్న విజయసాయి పేరును ఈడీ తాజా ఫిర్యాదులో తొలగించింది. అలాగే, జగన్‌కు చెందిన కార్మెల్ ఏసియా లిమిటెడ్, ఐఏఎస్ అధికారి ఎస్ఎన్ మొహంతిని కూడా నిందితుల జాబితా నుంచి తొలగించింది.