మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్న జగన్ సర్కారు : కాల్వ శ్రీనివాసులు
మంగళవారం, 19 జనవరి 2021 (19:56 IST)
రాష్ట్రంలో వింతపరిస్థితిని, కొత్త పోకడలను చూస్తున్నామని, ప్రజలు ఎన్నుకున్నప్రభుత్వం మతవిద్వేషాలకు ఆజ్యం పోసేలా వ్యవహరించడం, మంత్రులు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే వారు పనిగట్టుకొని ప్రజలమధ్యన వైషమమ్యాలు తలెత్తేలా, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా పనిచేయడం, వారిని సమర్థించేలా పోలీసుల చర్యలుండటం అత్యంత ప్రమాదరకమని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు హెచ్చరించారు.
మంగళవారం ఆయన తన నివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. దేవాలయాల విధ్వంసానికి, హిందూమతంపై దాడికి సంబంధించి, 9 కేసుల్లో రాజకీయపార్టీలు కుట్రలుచేసినట్లు తమకు సాక్ష్యాధారాలు లభించామని డీజీపీ అధికారికంగా చెప్పడం అనేది ఎవరికీ జీర్ణం కాని విషయమన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక లాపాలు సాగాలని రాజకీయపార్టీలకార్యకర్తలు కూడా కోరుకుంటా రన్నారు. డీజీపీ చెప్పిన ఘటనల్లో ఒకటైన కర్నూలు జిల్లా మద్దికెరలో గుప్తనిధులకోసం తవ్వకాలు జరిగిన అంశంలో టీడీపీవారి ప్రమేయముందన్నారు. మద్దెమ్మ ఆలయంలో జేసీబీతో తవ్వకాలు జరిపినట్లు, ఆనాడు వార్తలొచ్చాయన్నారు. ఆ సంఘటన 16-12-2020లో జరిగితే, 28-12-2020న స్థానిక వీఆర్వో ఫిర్యాదుతో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కేసులో అనుమానితులను, నిందితులను, అరెస్ట్ చేసినప్పుడు, కర్నూలు జిల్లా ఎస్పీ వారి పేర్లను, ప్రాంతాలను వెల్లడించడం జరిగిందని శ్రీనివాసులు చెప్పారు.
ఆనాడు జిల్లా ఎస్పీ సదరు ఘటనలో టీడీపీ సానుభూతి పరులున్నారని ఎక్కడా చెప్పలేదన్న టీడీపీనేత, ప్రతిపక్షపార్టీకి, గుప్త నిధుల తవ్వకాలకు ఏవిధమైన సంబంధంలేదన్నారు. కడప జిల్లాలో జరిగిన మరోసంఘటనలోకూడా టీడీపీ ప్రమేయం లేదన్న ఆయన, ఒకవ్యక్తి కావాలనే ఆంజనేయస్వామి విగ్రహానికి అపచారం చేశాడని అక్కడున్నవారందరూ చెప్పడం జరిగిందన్నారు. మిగిలిన ఏడు కేసులు సోషల్ మీడియాకు సంబంధించినవని, వాటిలో రాజకీయపార్టీలవారు, బయటివారు ఉండటం సహజమని కాల్వ తెలిపారు.
హిందూ ధర్మాన్నికాపాడుకునే వ్యక్తులు ఎవరైనా సరే, బాధతో తమఅభిప్రాయాలను పంచుకోవడం తప్పెలా అవు తుందని మాజీమంత్రి పోలీసులను ప్రశ్నించారు. రాములవారి శిరస్సు ఖండించడమనేది ఎంతటి దుర్మార్గమైన చర్యో చెప్పాల్సిన పనిలేదని, అటువంటి ఘటనజరిగినప్పుడు హిందూమతాభిమా నులు స్పందించకుండా ఎలా ఉంటారన్నారు. అసలైన ముద్దాయిలను, దోషులను కనిపెట్టి, వారిని శిక్షించినప్పుడే, పోలీసులపై ఎవరి కైనా నమ్మకం కలుగుతుందన్నారు.
ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో టీడీపీ, బీజేపీలపై నిందలేస్తే, ఆయన వ్యాఖ్యలను సమర్థించడం కోసం డీజీపీ రెండురోజుల వ్యవధిలోనే పొంతనలేకుండా మాట్లాడాడన్నారు. డీజీపీ వ్యాఖ్యలు విన్నవారెవరికైనా రాష్ట్రంలో ఏం జరుగుతోందోననే భయం, ఆందోళన కలగకుండా ఎలా ఉంటాయని కాలవ ప్రశ్నించారు. ఏనాడూ లేనివిధంగా ముఖ్యమంత్రి గోపూజలు చేయడం కూడా, తన ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి చేసిందేనన్నారు.
ఎవరైనా అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఎల్వీ సుబ్రహ్మణ్యానికి పట్టిన గతే తమకు పడుతుందనే భయాందోళనలో కూడా వారున్నారని కాల్వ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విశ్వసనీయత పూర్తిగా పడిపోయిన సందర్భంలో, హిందూమతంపై జరుగుతున్న దాడుల విషయంలో పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో నెలకొన్న సందర్భంలోనే వెల్లంపల్లి శ్రీనివాస్ వంటివారి మాటలు వారి స్థాయిని తగ్గిచండంతోపాటు, ప్రభుత్వ పరువుని గంగలో కలిపాయని శ్రీనివాసులు స్పష్టంచేశారు.
నాలుగుదశాబ్దాల నుంచి రాష్ట్రంలో క్రియాశీలక భూమిక పోషిస్తున్న టీడీపీపై, డీజీపీ నిరాధారఆరోపణలతో బురదజల్లడం చూస్తుంటే, డీజీపీ పాలకపక్ష కుట్రలో పావుగా మారారని తమకు అర్థమవుతోందన్నారు. టీడీపీ వారే చేశారనడానికి డీజీపీ దగ్గర ఏం ఆధారాలున్నాయో బయట పెట్టాలన్న కాల్వ, ఏసమాచారంతో రాజకీయ కుట్రలున్నాయని పోలీస్ బాస్ చెప్పాడన్నారు. కడపలోగానీ, కర్నూల్లోగానీ, జరిగిన సంఘటనల్లో టీడీపీవారు ముద్దాయిలని, స్థానిక జిల్లాఎస్పీలు ఎక్కడాచెప్పలేదని, వారికి విరుద్ధంగా డీజీపీ అసంబద్ధంగా,సత్య దూరమైన ఆరోపణలు డీజీపీ చేయడమనేది అతిపెద్దనేరమని కాల్వ తేల్చిచెప్పారు.
తన రాజకీయయజమాని ప్రశంశలకోసం, మెప్పుకోసం ఒకఉన్నతాధికారి ఈ విధమైన వ్యాఖ్యలుచేయడం అనేది ఇదివరకెన్నడూ రాష్ట్రంలో చూడలేదన్నారు. రాజకీయపార్టీ లు ఆదేశించినా చట్టాలకు, నిబంధనలకు అతీతంగా తాము చేయమనిచెప్పిన అధికారులను గతంలో ఎందరినో చూశామన్నా రు. డీజీపీ చేసిన వ్యాఖ్యలనుఆయన సరిదిద్దుకోకుంటే, పోలీస్ వ్యవస్థపై, డీజీపీపై ప్రజల్మో నమ్మకం సన్నగిల్లుతుందని, ఆయన ప్రమాదరకమైన దోవలో పయనిస్తున్నారని తెలుసుకుంటే మంచి దన్నారు.
టీడీపీ ఏధర్మానికి అపచారం జరిగినా, ఏమతానికి ఇబ్బంది వచ్చినా, ఆయామతాలు,ధర్మాలను ఆచరించేవారి పక్షాన నిలుస్తుందనే విషయాన్ని డీజీపీ గ్రహించాలన్నారు. డీజీపీ తన వ్యాఖ్యలతో తనను తానే దిగజార్చుకున్నాడని, ఇప్పటికైనా ఆయన స్వీయసమీక్ష జరిపి, వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని కాలవ హితవుపలికారు. ఐపీఎస్, ఐఏఎస్ హోదాల్లో ఉన్నఅధికా రులు రాజకీయాలు అమలుచేయాలని చూస్తే, ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందని కాలవ తేల్చిచెప్పారు.
ఇప్పటికే కావాల్సినంత ప్రజావ్యతిరేకతను ప్రభుత్వం మూటగట్టు కుందని, అటువంటి ప్రభుత్వాన్ని వెనకేసుకురావడానికి చూసే అధికారులుకూడా తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వం చేస్తున్న కుట్రల్లో, చట్టాలను కాపాడాల్సినవారు భాగస్వా ములై, ఐపీసీ నిబంధనలను కాదని, వైసీపీ నిబంధనలను అమలు చేస్తున్నారన్నారు. అటువంటి అధికారులును ఎవరూ కాపాడలేర న్న కాలవ, భోగిరోజు, కనుమ రోజు మాట్లాడిన మాటలను డీజీపీ ఒక్కసారి బేరీజు వేసుకుంటే మంచిదన్నారు.
ఆయన చెప్పిన ఘట నలకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెప్పించుకొని సమీక్ష చేశాకనే డీజీపీ మాట్లాడలన్నారు.
ప్రవీణ్ చక్రవర్తి అనే పాస్టర్, 699గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానని, హిందూదేవతల విగ్రహాలను తనకుతానే ధ్వంసం చేశానని చెబుతుంటే, అతని వ్యాఖ్యలతో ఎంతమంది బాధపడ్డారో ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, డీజీపీపై లేదా అని కాల వ నిలదీశారు. ప్రవీణ్ పై ఈ ప్రభుత్వం చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇంతవరకు స్పష్టంచేయకపోవడం సిగ్గుచేటన్నారు.
మతం ముసుగులో వైసీపీ రాజకీయఅజెండాను భుజాలపై వేసు కున్న కొందరువ్యక్తులు, పరమతాలను దూషిస్తూ, రెచ్చగొడుతుం టే పాలకులు చూస్తూ ఊరుకోవడమేంటన్నారు? భిన్నమతాలు, భిన్న సంస్కృతులను గౌరవించాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించడం వారికే చేటు చేస్తుందన్నారు. హిందూమతాన్ని అనుసరించే వారి హృదయాలు గాయపడినప్పుడు, అటువంటి ఘటనలకు కారకులైనవారిని దండించి, తమప్రభుత్వం లౌకిక వాదానికి కట్టుబడి ఉందని నిరూపించుకోవాల్సిన బాధ్యత పాలకు లపైనే ఉందన్నారు.
రాజకీయస్వలాభంకోసం టీడీపీవారిపై బురద జల్లితే, అది అధికారపార్టీవారి ముఖాలపైనే పడుతుందని కాలవ స్పష్టంచేశారు. సహానానికి, ధర్మానికి, సహాయానికి మారుపేరుగా ఉన్న ధర్మంపై దాడిచేయడం, టీడీపీపై రాజకీయ కుట్రలుచేయడం, వంటి పనులు మానుకోకుంటే, ప్రభుత్వం ఆడుతున్న జగన్నాట కంలో, పాలకులే బలి అవుతారని, కొందరు అధికారులుకూడా వారితో పాటే మట్టిలో కలిసిపోతారని శ్రీనివాసులు తేల్చిచెప్పారు.