ఓ దొంగబాబాను ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.20 వేల విలువ గల వనమూలికలు, తాయత్తులను స్వాధీనం చేసుకొని భూతవైద్యశాలను మూసివేశారు. ఎస్‌ఐ రాజేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దౌలాన మండలం పతాక చపుత్ర గ్రామానికి చెందిన ఇర్ఫాన్(40) నగరానికి వచ్చి నాంపల్లిలో నివాసం ఉంటూ అమీర్‌పేటలోని బాటాషోరూం లేన్, కేవీఆర్ ఎన్‌క్లేవ్ సమీపంలో ఓ షెటర్‌ను అద్దెకు తీసుకొని మూలిక వైద్యం పేరుతో వశీకరణ స్పెషలిస్ట్‌గా అవతారమెత్తాడు.
ముషీరాబాద్ కుమ్మరిబస్తీకి చెందిన ఓ వివాహిత ఇర్ఫాన్‌బాబాను ఆశ్రయించింది. భూత వైద్యం చేయించుకోవాలని బాబా చెప్పాడు. ఇందుకు రూ.50 వేలు ఇవ్వాలని అడగగా ఆమె ఇచ్చింది. ఇందుకు బాబా కొన్ని మూలికలు, తాయత్తును సదరు వివాహితకు ఇచ్చి వీటిని నిద్రపోతున్న భర్త తల కింద పెట్టాలని సూచించాడు.
బాబా చెప్పిన ప్రకారం 15 రోజులు దాటిపోతున్నా భర్తలో ఎలాంటి మార్పు రాకపోగా ఇరువురి మధ్య మరింత అగాదం పెరిగిపోతోంది. విషయాన్ని ఇర్ఫాన్‌బాబాకు తెలియజేయగా ఇక భర్తతో ఎలాంటి పని లేదు.. తానున్నానంటూ వక్రబుద్ధిని బయటపెట్టాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న సదరు వివాహిత పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.