సోదరి వైఎస్ షర్మిల ఆస్తుల వివాదంపై సోషల్ మీడియాలో జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురుస్తోంది. దీనిపై జగన్ మాట్లాడుతూ... ఇది ప్రతి ఒక్క ఇంట్లో వుండే విషయమేననీ, మీ ఇంట్లో అక్కతమ్ముడు, అన్నచెల్లెలు మధ్య ఆస్తి గొడవలు లేవా అంటూ వ్యాఖ్యానించారు. ఇంకోవైపు పార్టీలో కీలక నాయకురాలు వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడమే కాకుండా జగన్ బాధ్యతలేని నాయకుడు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవన్నీ కలిసి జగన్ ఒకింత ఒత్తిడికి గురయ్యోరో ఏమోగానీ మంత్రి నారా లోకేష్ పైన విరుచుకుపడ్డారు.
ఆయన మాట్లాడుతూ... “ఈ నారా లోకేష్‌కు మెదడు పని చేసే శక్తి లేదు. బహుశా అందుకే అతన్ని పప్పు అని పిలుస్తారు. ఆయన హేతుబద్ధత ఉన్న వ్యక్తిలా కనిపించడు. అతను పప్పులా కబుర్లు చెబుతాడు. లేకపోతే మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశా బిల్లును ఇలా పక్కనపడేస్తారా?" అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ ఈరోజు మాట్లాడేటపుడు పూర్తిగా నిరుత్సాహంగా కనిపించారు. లోకేష్ గురించి మాట్లాడుతున్నప్పుడు విపరీతమైన ఒత్తిడి, టెన్షన్‌లో ఉన్నట్లు కనిపించారు.
లోకేష్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నాయకులు తాజాగా వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తున్నారు. ఏపీలో మహిళలపై క్రైమ్ రేట్ ఎక్కువగా ఉందని ఆనాడు స్వయంగా జగన్ నామినేట్ చేసిన మహిళా కార్పొరేషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తన ముందు చెప్పినప్పుడు పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు వాసిరెడ్డి పద్మ బయటకు వచ్చి నిజాలు చెబుతుంటే జగన్ మోహన్ రెడ్డి మెదడు పనిచేయడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.