విద్యార్థులకు గురువు అంటే అసలు భయంభక్తులు వున్నాయా? ఇదివరకు గురువులు ఒక్క కేక వేస్తే వణికిపోయేవారు. కానీ ఇప్పుడలా కాదు అనేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోనే ఉదాహరణ. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో చోటుచేసుకున్నది. కళాశాలలోకి సెల్ ఫోన్ ఎందుకు తీసుకుని వచ్చావు అంటూ ఓ విద్యార్థిని నుంచి సెల్ ఫోన్ లాక్కున్నది మహిళా టీచర్. దీనితో సదరు విద్యార్థిని ఉపాధ్యాయురాలితో గొడవకు దిగింది.
తన ఫోన్ రూ. 12,000 పెట్టి కొన్నామనీ, తిరిగి ఇవ్వాలంటూ విద్యార్థిని గట్టిగా అరిచింది. ఆ తర్వాత బూతులు తిట్టడం ప్రారంభించింది. విద్యార్థిని అరిచినా టీచర్ మాత్రం ఫోనుని ఇవ్వనంటూ గట్టిగా చెప్పేసింది. దీనితో విద్యార్థిని తన కాలి చెప్పును తీసుకుని టీచర్ పైన దాడికి దిగింది. ఉపాధ్యాయురాలు కూడా విద్యార్థినిపై తిరగడటంతో పెనుగులాట జరిగింది. తోటివారు అక్కడికి చేరుకుని గొడవను సద్దుమణిగేట్లు చేసారు.