ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం : బీజేపీ ఎంపీ జీవీఎల్

ఆదివారం, 13 డిశెంబరు 2020 (17:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు చెప్పుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో ఒక సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టు వెల్లడించారు. 
 
ఆయన ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌లో క్రిస్మస్ సంబరాలపై మండిపడ్డారు. ప్రభుత్వమే మత ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్‌లో దసరా సంబరాలు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. 
 
తిరుపతి ఉప ఎన్నికలో రెండు పార్టీలకు బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నిధులు ఉన్నాయని, పెట్టుబడి అంతా నరేంద్ర మోడీ ప్రభుత్వానిదే అన్నారు. 
 
గత టీడీపీని, ఇప్పటి వైసీపీ సర్కార్‌కు ఛాలెంజ్ చేస్తున్నామని, వాళ్లు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి వేదికగా సమాధానం చెప్పాలన్నారు. లౌకిక పార్టీల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
 
మరోవైపు, ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో హిందూ మతాన్ని దెబ్బతీసేలా వైసీపీ సర్కారు వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేవాలయాల భూముల జోలికి వస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు.
 
రాష్ట్రంలో వైసీపీ సర్కారు అవినీతికి దారులు తెరిచిందనీ, ఏపీలో ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి వరకు ట్రేడింగ్‌ ప్రారంభించారని, అధికార వైసీపీ ఎమ్మెల్యేలే ఎర్రచందనం అక్రమ రవాణా‌ చేస్తున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు