కాకినాడ మేయర్ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానం, తొలగింపు విషయంలో కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తగ్ చేసింది. ఈనెల 25 న న్యాయస్థానం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాకినాడ మేయర్ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానం, తదనంతరం తొలగింపు విషయంలో ఈనెల 25న కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.
అవిశ్వాస తీర్మాన ఫలితం తాము ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటుందని ఆదేశించినా, ఫలితాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి పంపడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించారో చెప్పాలన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేతకు అనుబంధ పిటిషన్ వేస్తామని కోర్టుకు తెలిపి.. ఆ ప్రక్రియ పూర్తికాకముందే అవిశ్వాస తీర్మాన ఫలితాన్ని ప్రభుత్వానికి ఎలా పంపుతారని కలెక్టర్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ ఈమేరకు ఆదేశాలిచ్చారు.
తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టును మేయర్ పావని ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై గతంలో విచారణ జరిపిన న్యాయమూర్తి.. అవిశ్వాస తీర్మానంపై ఈనెల 5న జరగనున్న సమావేశ ఫలితం తాము ఇచ్చే తుదితీర్పునకు లోబడి ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అయితే అవిశ్వాస తీర్మాన ఫలితాన్ని కలెక్టర్.. ప్రభుత్వానికి సంపడంతో మేయర్ పదవి నుంచి పావనిని తొలగిస్తూ సర్కార్ జీవో జారీచేసింది. వాటిని సవాలు చేస్తూ పావని తాజాగా హైకోర్టులో మరో వ్యాజ్యం వేశారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కలెక్టర్ వ్యవహరించారని పిటీషనర్ న్యాయవాది రఘు వాదనలు వినిపించారు. ఫలితాన్ని ప్రభుత్వానికి పంపడంతో తొలగింపు జీవో ఇచ్చారన్నారు.