ప్రసన్నం కోసం వెళ్లి మావోల తూటాలకు బలయ్యారు... దాడి జరిగిందిలా...

సోమవారం, 24 సెప్టెంబరు 2018 (10:27 IST)
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరపడానికి క్వారీ వివాదమే కారణంగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమతో కలిసి నిమిటిపుట్టు గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ గ్రామస్తులతో చర్చిస్తుండగా సుమారు 60 మంది మావోయిస్టులు హఠాత్తుగా వారిని చుట్టుముట్టారు.
 
ఇటీవల చోటుచేసుకున్న పలు అంశాలపై వారు ఎమ్మెల్యేతో గంటపాటు చర్చించారు. ఎమ్మెల్యేకు చెందిన గూడ క్వారీపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్వారీ వల్ల పర్యావరణానికి దెబ్బ తగులుతుందని, దాన్ని మూసివేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. అయితే దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, బెదిరింపులకు దిగటం సరికాదని వారించారు. దీంతో మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కిడారితో పాటు మాజీ ఎమ్మెల్యే సోమకు తుపాకులు ఎక్కుపెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 40మంది మహిళా మావోయిస్టులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
 
విశాఖ మన్యంలో మావోయిస్టులు చాలాకాలం నుంచి స్తబ్దుగా ఉన్నారు. గ్రే హౌండ్స్‌ దళాలు, ఒడిశా పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేయడంతో మావోయిస్టులు ఉనికే ప్రశ్నార్దకంగా మారింది. అయితే ఇటీవల కాలంలో వారు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారోత్సవాలు జరపడం, పోస్టర్లు ఏర్పాటుచేయడం వంటి చర్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు భద్రత లేకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లొద్దని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. అయినా ఈ ఇద్దరు నేతలు గ్రామ పర్యటనలకు వెళ్లి మావోల తూటాలకు బలయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు