మన్యంలో మావోయిస్టుల తూటాలకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావుతో పాటు.. మాజీ ఎమ్మెల్యే సోమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, మావోయిస్టులు తమను చుట్టుముట్టిన సమయంలో గన్‌మెన్‌లు ప్రతిఘటించేందుకు, కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు. అపుడు ఎమ్మెల్యే కిడారి వారిని వారించారు. "వాళ్లు వచ్చింది నాకోసం. మీరు కాల్పులు జరిపితే వాళ్లూ జరుపుతారు. సంబంధంలేని వాళ్లు చనిపోతారు. వాళ్లతోపాటు వెళతాం. అదృష్టం బాగుంటే తిరిగి వస్తాం" అంటూ గన్‌మన్‌ను కిడారి నిలువరించారు.
ఆ తర్వాత ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలతో మాతో రండి.... మాట్లాడాలి అని చెప్పారు. 'ఎలాంటి హానీ తలపెట్టం. మాట్లాడి పంపిస్తాం' అంటూ ముగ్గురు గన్‌మన్‌ల వద్ద ఉన్న ఆయుధాలను మావోయిస్టులు స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు వాహనాల్లో ఉన్న టీడీపీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేశారు. 'మీరు ఇక్కడే ఉండండి. పక్కకు కదలొద్దు' అని చెప్పారు. ఆ తర్వాత ఆ ఇద్దరు నేతలను పక్కకు తీసుకెళ్లారని చెప్పారు.
ఆ తర్వాత కిడారి సర్వేశ్వరర రావు, సివేరి సోమలను మహిళా మావోయిస్టులు వాహనాల నుంచి కిందికి దించారు. వారు ప్రతిఘటించేందుకు వీల్లేకుండా చేతులు వెనక్కి కట్టారు. ఒకరిని ఒక బృందం, మరొకరిని ఇంకో బృందం చెరోవైపు తీసుకెళ్లాయి. సివేరి సోమను వాహనం నుంచి 20 మీటర్ల దూరంలో గుంటసీమ వైపు తీసుకెళ్లారు. 'ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నావు' అంటూ పెద్దగా ఎక్కువసేపు మాట్లాడకుండానే సోమను కాల్చి చంపేశారు. కణతమీద, ఛాతీ మీద అతి సమీపం నుంచి కాల్చిచంపారు. మొత్తం మూడు రౌండ్లు పేల్చారు. సోమ విగతజీవుడై రహదారిమీదే పడిపోయారు.
అటు... ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును సుమారు పాతిక మీటర్ల దూరం తీసుకెళ్లి ఓ చెట్టుకింద నిలబెట్టారు. సుమారు 20 నిమిషాలపాటు చర్చలు జరిపారు. బాక్సైట్ తవ్వకాలు, ఎమ్మెల్యే హుకుంపేటలో నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీ, అరకు ఎంపీపీ అవిశ్వాసం వివాదంలో వ్యహరించిన తీరు తదితర అంశాలను నక్సల్స్ ప్రస్తావించినట్లు తెలిసింది. తనను ఏమీ చేయవద్దని, ప్రజానుకూలంగా నడుచుకుంటానని ఎమ్మెల్యే వేడుకున్నారు.
అయినా, మావోయిస్టులు వినిపించుకోలేదు. ఆయన ఛాతీ, తలలోకి రెండు తూటాలు దింపారు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరినీ రివాల్వర్లతో పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి చంపేశారు. ఎమ్మెల్యేల వాహనాలు ఆపిందీ, వారిని తమతో తీసుకెళ్లిందీ, చంపిందీ... అందరూ మహిళా మావోయిస్టులే కావడం గమనార్హం.