ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయాన్ని ఆకాంక్షిస్తూ ఓ వ్యక్తి ఆలయంలో నాలుక కోసుకున్నాడు. శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఆ తర్వాత బ్లేడుతో తన నాలుకను కోసుకున్నాడు. దీన్ని గమనించిన ఆలయ సిబ్బంది, ఇతర భక్తులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ పనికి పాల్పడిన వ్యక్తిని వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన మహేశ్‌గా గుర్తించారు.
హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉండే మహేశ్.. చంద్రబాబును సీఎంగా తిరిగి చూడాలని బలంగా కోరుకునేవాడు. ఈ క్రమంలో స్థానిక వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత బ్లేడుతో నాలుక కోసుకున్నాడు. సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేశ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ మహేశ్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి 100 నుంచి 145 సీట్లలో గెలవాలని ఆకాంక్షించాడు. కాగా, జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలంటూ గతంలో కూడా ఈయన ఇదే పనికి పాల్పడినట్టు సమాచారం.