29న తిరుపతిలో మేధోమధన రౌండ్ టేబుల్ సమావేశం: ఆంధ్రప్రదేశ్ బి.సి. సంక్షేమ సంఘం

బుధవారం, 18 నవంబరు 2020 (07:14 IST)
ఈ నెల 29న తిరుపతిలో బి.సి., ఎస్.సి., ఎస్.టి. మైనారిటీల రాజకీయ పార్టీ నిర్మాణ సన్నాహక మేధోమధన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బి.సి. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు తెలిపారు.

ఇటీవల గుంటూరులో ఆంధ్రప్రదేశ్ బి.సి. సంక్షేమ సంఘం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో అణచబడ్డ కులాలకు, మైనారటీలకు తమదైన రాజకీయ పార్టీ అవసరం అనీ, అలాంటి పార్టీ నిర్మాణానికై సన్నాహక కార్యక్రమాలు తక్షణమే చేపట్టాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. దీనిలో భాగంగానే తిరుపతిలో తొలిసమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

అణచబడ్డ కులాలు గత 70 సంవత్సరాలకు పైగా ఏ జీవన రంగంలోను సామాజిక న్యాయం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజనులను ఆధిపత్య కులాల పార్టీలు ఓటు బ్యాంక్ గా ఉపయోగించు కుంటూ రాజ్యాధికారాన్ని కొల్లగొడుతున్నాయని, రాయితీలు ఎరవేసి మభ్య పెట్టి మోసం చేస్తున్నారని ఆరోపించారు.

రాజ్యాధికారం ద్వారా తప్ప బహుజనులకి సామాజిక న్యాయం లభించే అవకాశం లేదని, బహుజనుల పైన సాగుతోన్న అణచివేతలు, అత్యాచారాలు, దోపిడీలు, రాజ్యాధికారం ద్వారానే అంతం అయిపోయయాని గత 70 ఏళ్ళ అనుభవం ఋజువు చేసిందన్నారు. రాజ్యాధికారం సాధించుకోవాలంటే తమదైరన రాజకీయ పార్టీ తప్పనిసరి అవసరం అన్నారు.

ప్రస్తుతం ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలేవీ బి.సి., ఎస్.సి., ఎస్.టి., మైనారిటీల పార్టీలు కావని... తమదైన పార్టీ నిర్మాణ సన్నాహాలు పూర్తిచేసుకొని పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలసిన అవసరం ఎంతో ఉందన్నారు.

కావున ఈ నెల 29న తిరుపతిలో జరిగే మేధోమధన రౌండ్ టేబుల్ సమావేశానికి బి.సి., ఎస్.సి., ఎస్.టి. మైనారిటీలకు చెందిన ప్రముఖులు, ప్రతినిధులు, మేధావులు, యువజన విద్యార్ధి, మహిళ, ఉద్యోగ వర్గాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యక్రమం రూపకల్పనలో భాగస్వాములు కావాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు