గుంటూరు జిల్లా సూర్యలంకలో శతగ్నిదళ విన్యాసాలు... 8 సార్లు వైమానిక దాడులు...

బుధవారం, 31 అక్టోబరు 2018 (19:20 IST)
అమరావతి : డిసెంబరు 3 నుంచి 15వ తేదీ వరకూ గుంటూరు జిల్లా సూర్యలంక పరిధిలో సముద్ర దిశగా శతగ్నిదళ విన్యాసాలు నిర్వహించనున్నట్టు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక వైమానిక దళ యూనిట్‌కు సముద్ర దిశగా శతగ్నిదళ విన్యాసాలు నిర్వహించడానికి అనుమతించారు. డిసెంబరు 3 నుంచి 15 వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ విన్యాసాలు జరపనున్నారు.
 
సూర్యలంక సముద్ర ప్రాంతంలో విన్యాసాలు జరిగే సమయంలో గరిష్ఠంగా 100 కి.మీ వరకు సురక్షితం కాదని ప్రకటనలో తెలిపారు. ఎత్తుతో సంబంధం లేకుండా గగనతలం కూడా ఆ సమయంలో సురక్షితం కాదని ప్రకటించారు. కాల్పుల ప్రాంతానికి చుట్టూ ఉన్న 25 కి.మీ. భూ పరిధి, ఆ పరిధిలో ఉన్న గరిష్ఠ స్ధాయి గగనతలం ప్రమాదకరమైందిగా ప్రకటించారు. 
 
డిసెంబరు 3 నుంచి 15 వరకు ప్రతిరోజూ రెండు కన్నా ఎక్కువసార్లు ఆకాశ లక్ష్యం దిశగా కాల్పులు నిర్వహిస్తారు. సూర్యలంకలోని వైమానిక స్థావర ప్రాంతంలో డిసెంబరు 3 నుంచి 15 వరకు రెండు విడతలుగా 6 నుంచి 8 సార్లు వైమానికి దాడులు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ పొలిటికల్ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు