జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలోని అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమ సమస్యలపై అధ్యయనానికే వచ్చినట్టు చెప్పారు. అలాగే, రాయలసీమలో ఏర్పడే కరువుకు శాశ్వత పరిష్కారం కనుగొందామని తెలిపారు.
ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ప్రజల మేలుకోరే వ్యక్తిగా తాను వచ్చానని చెప్పారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే, వేదికపై రైతులు సమస్యలు వివరిస్తుండగా అదే సమయంలో అభిమానులు ఈలలు వేయడంతో అలా చేయకూడదని పవన్ కల్యాణ్ హితవు పలికారు. సమస్యలపై చర్చిస్తున్నప్పుడు అటువంటి పనులు చేయకూడదని సుతిమెత్తగా హెచ్చరించారు.
కాగా, కరవు నివారణ చర్యలపై, పంటసాగుకు తీసుకోవాల్సిన చర్యలపై మేధావులు, వ్యవసాయ నీటి పారుదల రంగ నిపుణులతో చర్చించానని వారు ఇచ్చిన సూచనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తాను ఏదో ఒక్కరోజు అనంతపురానికి వచ్చి వెళ్లిపోవడం కాదని, శాశ్వత పరిష్కారాన్ని చూపే దిశగా వెళదామనే ఇక్కడకు వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు.