తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు జనసేన సంపూర్ణ మద్దతు... పవన్‌ రోడ్లపైకి వస్తారా?

సోమవారం, 14 అక్టోబరు 2019 (16:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెబాటపట్టారు. ఈ సమ్మె సోమవారానికి పదో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం మెట్టుదిగకపోవడం, కార్మికులు బెట్టివీడకపోవడంతో ఈ సమ్మె కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆయన సోమవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 
 
ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చిందని… కార్మికుల ఆవేదన అర్థం చేసుకోవాలని జనసేన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ రాణీగంజ్‌లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికులు ఆత్మార్పణం చేసుకోవడం బాధాకరమన్నారు. ఇకపై ఇలాంటి బలిదానాలు జరగకూడదని పార్టీ ప్రకటనలో తెలిపింది. 
 
48 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఉద్యోగ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రజానీకంలోనూ ఆవేదన రేకెత్తిస్తుందని జనసేనాని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ భద్రత లేకుండా పోయింది అనే ఆందోళన అందరిలో కలిగిందని వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ ప్రభుత్వం తక్షణం చర్చించాలని… సమ్మె మరింత ఉధృతం కాకుండా పరిష్కరించాలని జనసేన కోరింది.
 
ఇదిలావుంటే, తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పదో రోజుకి చేరింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల వ్యాప్తంగా బంద్ చేపట్టారు. ఆదివారం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. చివరకు ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 
 
దీనికి నిరసనగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో నిరసన తెలుపనున్నట్లు కార్మికులు తెలిపారు. నేటి ఉదయం నుంచే బస్టాపుల వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్‌ల ఆత్మహత్యలకు నిరసనగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. 
 
కార్మికుల బంద్‌కు ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతిస్తున్నాయి. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ఒంటరి అవుతోంది. నేటి నుంచి మంత్రుల్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని కార్మికులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు