నిజానికి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో ఉన్న మూడు మినిస్టర్ పోస్టుగా ఖాళీలు ఉన్నాయి. ఒకటి వెంకయ్యనాయుడిది కాగా, రెండోది మనోహర్ పారికర్‌ది. గోవా సీఎంగా పారికర్ వెళ్లడంతో ఆయన స్థానం ఖాళీ అయింది. పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దేవ్ అకాల మరణం చెందడంతో మూడో స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి హరిబాబుకు చోటు కల్పించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
హరిబాబు పేరు తెరపైకి రావడానికి కూడా ఓ కారణం లేకపోలేదు. ప్రస్తుం కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరాదివారు ఎక్కువగా ఉండటంతో, ఈసారి వారికి స్థానం దక్కకపోవచ్చని విశ్వసనీయ సమాచారం. దక్షిణాదిలో బలపడాలని బీజేపీ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, ఈసారి కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాదివారికే అవకాశం కల్పించవచ్చని చెబుతున్నారు.
ఏపీలో ఒకరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే... ఇక్కడ బలపడవచ్చని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర మంత్రి పదవికి ఏపీ నుంచి విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబే సమర్థుడని పార్టీ అధినాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఏపీ బీజేపీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. అలాగే, తమిళనాడులోని అధికార అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎంపీలకు ఈ దఫా మంత్రిపదవులు దక్కనున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం వర్గం ఎంపీల్లో పలువురు కేంద్ర మంత్రులుగా త్వరలోనే బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.