జనం నుంచి జలంలోకి... హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (09:19 IST)
దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్‌ మహాగణపతి మంగళవారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాగణపతి శోభాయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. వందల టన్నుల బరువును సైతం అవలీలగా మోయగల భారీ హైటెక్‌ వాహనంపై గణనాథుడు హుస్సేన్‌సాగర్‌కు పయనమయ్యాడు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఖైరతాబాద్‌ గణేశుడిని నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు చేరుకునే గణనాథులను నిమజ్జనం చేసేందుకు భారీ సంఖ్యలో క్రేన్లు సిద్ధం చేశారు. 
 
కాగా, మొత్తం 11 రోజులపాటు అశేష భక్తజనుల పూజలందుకున్న శ్రీ చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. అరవై అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకున్న ఈ భారీ గణనాధుని శోభాయాత్ర ఖైరతాబాద్ సెన్సేషన్ థియేటర్ మీదుగా రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్‌భవన్, ఇక్బాల్ మినార్, సెక్రటేరియట్ ఫ్లైఓవర్, లుంబినీ పార్కు మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్ నంబర్ నాలుగు వద్దకు చేరుకోనుంది. 
 
అక్కడ అనంతరూపుడికి మరోసారి పూజలు చేసి గుమ్మడికాయతో దిష్టితీస్తారు. అనంతరం మహాగణపతి నిమజ్జనం పర్వం ముగుస్తుంది. శోభాయాత్ర మార్గంలో భక్తులు, ప్రజలు సంప్రదాయక నృత్యాలు కొనసాగిస్తున్నారు. భారీ విఘ్నేశ్వరుడి శోభాయాత్రను కనులారా వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర కూడా ప్రారంభమైంది.

వెబ్దునియా పై చదవండి