కుల దైవమంటే ఏమిటో తెలియని అజ్ఞాని మంత్రి కొడాలి నాని: నాగేంద్ర

శుక్రవారం, 22 నవంబరు 2019 (16:06 IST)
ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమల కొండ‌పై మంత్రి కొడాలి నాని వాడిన భాషను సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎందుకు సమర్థిస్తున్నార‌ని, త‌ద్వారా రాష్ట్ర ప్రజలకు, భక్తులకు ఏ విధ‌మైన సంకేతం ఇస్తున్నార‌ని కృష్ణాజిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొత్త నాగేంద్రకుమార్ ప్ర‌శ్నించారు. శుక్ర‌వారం ఉద‌యం విజ‌య‌వాడ‌లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో నాగేంద్ర‌కుమార్ మాట్లాడుతూ మద్యం ధరలు, టీటీడీ లడ్డూతో సహా ధరల పెంపుదలపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వక్రభాష్యాలు చూపిస్తూ వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని వాటిని తాము ఖండిస్తున్నామ‌న్నారు.
 
మద్యం ధరలు పెంచినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పెరిగిన ధరలతో మద్యం వినియోగదారులకు కొనాలంటే షాక్ తగిలి పారిపోతారని వాఖ్యానించార‌ని, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెంచిన ధరలతో తిరుమలకు వచ్చే భక్తులు సంఖ్యను తగ్గించాలని కోరుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. మద్యం ధరలు పెంపుదల స‌మ‌యంలో జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు సహేతుకమైతే ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా సమంజసమే అన్నారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానంపై రాష్ట్ర మంత్రులు చేసిన వాఖ్యలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే వైకాపా నాయకులు చంద్రబాబు వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి తన కులదైవం అని చెప్పిన వ్యాఖ్యలను సైతం మంత్రి కొడాలి నాని వక్రీక‌రించి మాట్లాడుతున్నార‌ని తెలిపారు. కుల దైవమంటే ఒక కులానికి దైవం కాదని వంశపారంపర్యంగా ఏ దైవాన్ని అయితే పూజిస్తారో వారినే కులదైవంగా కొలుస్తారన్న విషయం తెలియని అజ్ఞాని రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతుండటం ప్రజల దురదృష్టం అని వ్యాఖ్యానించారు. 
 
చంద్రబాబు పూజిస్తే కమ్మ కులదైవం, జగన్మోహన్‌రెడ్డి పూజిస్తే రెడ్డి కులదైవం, పవన్ కల్యాణ్ పూజిస్తే కాపు కులదైవం కారని మంత్రి నానికి ఆయ‌న ఈ సంద‌ర్భంగా హితవు పలికారు. కమ్మ వారిని విమర్శిస్తే రెండున్నర సంవత్సరాల మంత్రి పదవి ఐదేళ్ల పాటు ఉంటుంద‌నే ఉద్దేశంతోనూ మంత్రి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నార‌ని ఆరోపించారు. తిరుమలపై మంత్రి కొడాలి నాని భాషను సమర్థిస్తున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారని స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు