పెన్సిల్ బ్లేడుతో చంపేశాడు.... టెన్త్ విద్యార్థి ఘాతుకం
బుధవారం, 7 ఆగస్టు 2019 (10:53 IST)
ఏపీలోని కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ హాస్టల్‌లో జరిగిన మూడో తరగతి విద్యార్థి హత్య కేసులోని మిస్టరీ వీడింది. మూడో తరగతి విద్యార్థి ఆదిత్యను హత్య చేసింది పదో తరగతి విద్యార్థి అని పోలీసులు నిర్ధారించారు. పైగా, హత్యకు పెన్సిల్ బ్లేడును ఉపయోగించినట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లాలోని చల్లపల్లి బీసీ హాస్టల్‌లో మూడో తరగతి చదివే విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం తెల్సిందే. బాత్రూమ్‌లో గొంతుకోసి హత్య చేశారు.
చర్లపల్లి నారాయణనగర్‌కు చెందిన ఆదిత్య అన్న కూడా ఇదే హాస్టల్‌లో ఉంటున్నాడు. రోజు అన్న పక్కనే పడుకునే ఆదిత్య సోమవారం రాత్రి అతని గదికి రాలేదు. దీంతో పక్క గదిలో ఉండొచ్చని ఆదిత్య అన్న భావించాడు. అయితే, మంగళవారం కూడా అతను రాలేదు. దీంతో అక్కడకు వెళ్లి చూసేసరికి ఆదిత్య బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హాస్టల్‌కు చేరుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. గొంతు కింద కోసి ఉండడంతో ఆదిత్యను ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హాస్టల్ వార్డెన్‌తో పాటు తోటి విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ దర్యాప్తులో అనేక ఆసక్తిక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్ దగ్గర జరిగిన చిన్న వివాదమే హత్యకు కారణమని తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పెన్సిల్ చెక్కే బ్లేడ్‌తో ఆదిత్య గొంతు కోసి మర్డర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఈ నెల 5వ తేదీ సోమవారం సాయంత్రం ఆదిత్య, 10వ తరగతి విద్యార్థి మధ్య చిన్న గొడవ జరిగింది. అది కాస్తా పెద్దదైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ కొట్టుకున్నారు. మైదానంలో ఆడుకుంటున్న సమయంలో బాల్ ఇవ్వాలని ఆదిత్యను టెన్త్ క్లాస్ విద్యార్థి అడిగాడు.
ఆదిత్య అందుకు అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అందరి ముందు నా పరువు తీస్తావా అని టెన్త్ క్లాస్ విద్యార్థి.. ఆదిత్యపై పగ పెంచుకున్నాడు. రాత్రి భోజనం సమయంలోనూ ఇద్దరికీ గొడవ జరిగింది. దీంతో ఆదిత్యను మట్టుబెట్టాలని ప్లాన్ వేశాడు టెన్త్ క్లాస్ విద్యార్థి.
ఈ పథకంలో భాగంగా అర్థరాత్రి సమయంలో ఆదిత్యను బాత్ రూమ్‌లోకి తీసుకెళ్లి పెన్సిల్ బ్లేడ్ తో పీక కోసి చంపాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.