కృష్ణాలో దారుణం : ఫ్రెండ్‌ను లారీతో తొక్కించిన డ్రైవర్.. ఎందుకంటే...?

ఆదివారం, 4 అక్టోబరు 2020 (17:24 IST)
కృష్ణా జిల్లా కంచికర్లలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. కట్టుకున్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు స్నేహితుడు అని కూడా చూడకుండా ఓ డ్రైవర్ లారీతో తొక్కించి చంపేశాడు. గత నెలలో ఈ దారుణం జరుగగా, ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కంచికచర్లకు చెందిన మూల్పూరి రాంగోపాల్, తోట నాగేంద్రబాబు అనే ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులుగా ఉంటున్నారు. వీరిలో నాగేంద్రబాబు ఓ లారీ డ్రైవర్. అయితే, రాంగోపాల్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానం నాగేంద్రబాబులో పురివిప్పింది. దాంతో రాంగోపాల్‌ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని పక్కా ప్లాన్ వేశాడు.
 
ఇక, హైదరాబాద్ వెళుతున్నానంటూ రాంగోపాల్ ఆగస్టు చివరి వారంలో ఇంటి నుంచి బయల్దేరాడు. సెప్టెంబరు 5 నుంచి అతడి ఫోన్ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడి మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేయడంతో బొబ్బిలి టవర్ పరిధిలో ఉన్నట్టు గుర్తించారు. 
 
రాంగోపాల్ లారీ డ్రైవర్ నాగేంద్రబాబుతో సన్నిహితంగా ఉంటాడని తెలుసుకున్న పోలీసులు, నాగేంద్రబాబును అరెస్టు చేస్తే అసలు దారుణం వెల్లడైంది. అసలేం జరిగిందంటే... హైదరాబాద్ వెళుతున్నానని ఇంట్లో చెప్పిన రాంగోపాల్ వాస్తవానికి తన ఫ్రెండ్ నాగేంద్రబాబుతో కలిసి లారీలో గుజరాత్ వెళ్లాడు. అక్కడి నుంచి సెప్టెంబరు 5వ తేదీన మార్బుల్ లోడుతో బొబ్బిలి వచ్చారు.
 
అన్‌లోడ్ చేసి కంచికచర్ల వచ్చే క్రమంలో పారిశ్రామికవాడ వద్ద లారీ నిలిపిన నాగేంద్ర బాబు... రాంగోపాల్‌కు బాగా మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న రాంగోపాల్‌ను రోడ్డుపై పడేసి తన లారీతో నిర్దాక్షిణ్యంగా తొక్కించి చంపేశాడు. 
 
ఆ సమయంలో క్లీనర్ శివ లారీలో నిద్రపోతున్నాడు. కాసేపటి తర్వాత శివ మేల్కొని రాంగోపాల్ గురించి ప్రశ్నించగా, విశాఖలోని బంధువుల ఇంటికి వేరే వాహనంలో వెళ్లిపోయాడని నాగేంద్రబాబు అతడితో చెప్పాడు. ఆ విధంగా స్నేహితుడ్ని కడతేర్చాడు. 
 
ఆ తర్వాత ఏం తెలియనట్టుగా ఇంటికి వచ్చాడు. అయితే, మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో లారీ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు