నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం దిశగా దూసుకెళుతున్నారు. ఈ ఎన్నికలో భాగంగా, పోలింగ్ ముగిసిన తర్వాత విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సర్వే అక్షరాల నిజమైంది. మొత్తం ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సమయానికి టీడీపీ 17253 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళుతోంది. ఇప్పటివరకు టీడీపీకి 46175 ఓట్లు రాగా, వైకాపాకు 28922, కాంగ్రెస్ 365 ఓట్లు వచ్చాయి.
ఇదిలావుండగా, ఎన్నికల సర్వేల్లో లెక్క తప్పని అంచనాలతో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం మరోసారి నిజమైందనే చెప్పొచ్చు. నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ముగిశాక ఓటరు నాడిపై లగడపాటి నిర్వహించిన ఆర్‌జీ ఫ్లాష్ సర్వే నాలుగు రోజుల కిందట వెల్లడించిన ఫలితం తెలుగుదేశం పార్టీవైపు మొగ్గు చూపింది.
కౌంటింగ్ ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి నంద్యాల రూరల్ మండలం ఓట్ల లెక్కింపు పూర్తవగా, టీడీపీ సుమారు 17 వేల ఓట్ల పై చిలుకు ఆధిక్యంతో కొనసాగుతోంది. నంద్యాలలో టీడీపీ 10 శాతం ఓట్ల మెజారిటీని సాధిస్తుందంటూ 1,73,335 మంది ఓటు వేసినందున.. 17,333 ఓట్ల మెజారిటీ టీడీపీకి రావచ్చని.. ఇది 15 వేలైనా కావొచ్చు.. 20 వేలకైనా రావొచ్చని అన్నారు. ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగాతీసుకున్నందునే పోలింగ్ శాతం పెరిగిందన్నారు.