లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు : స్వస్థలానికి చేరుకున్న 468 తెలంగాణ విద్యార్థులు

మంగళవారం, 5 మే 2020 (10:29 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు, వలస కూలీలు, పర్యాటకులు ఎక్కడివారు అక్కడే చిక్కుకునిపోయారు. ఈ క్రమంలో ఇలాంటి వారంతా తమతమ స్వస్థలాలకు చేరుకునేందుకు వీలుగా కేంద్రం లాక్‌డౌన్ ఆంక్షలను సడలించింది. అలాగే, వలస కూలీల తరలింపునకు రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. 
 
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకునిపోయిన తెలంగాణ విద్యార్థులు తమతమ ప్రాంతాలకు చేరుకున్నారు. వీరంతా వివిధ రకాల కోచింగ్‌ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటూ వచ్చారు. ముఖ్యంగా, కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్న అనేక కోచింగ్ సెంటర్లలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 468 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటూ వచ్చారు. ఇపుడు ఈ జిల్లా కరోనా వైరస్‌ కేసుల సంఖ్యలో ఏపీలోనే అగ్రస్థానంలో నిలిచింది. 
 
ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో తమతమ ప్రాంతాలకు చేరుకున్నారు. వీరంతా తమతమ గృహాలకు చేరుకునేందుకు నిజామాబాద్ మాజీ ఎంపీ కె. కవితతో పాటు.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డిలు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ విద్యార్థుల తరలింపునకు 21 ప్రత్యేక బస్సులను నడిపారు. అలాగే, తెలంగాణాకు చేరుకున్న వీరంతా తమతమ గృహాల్లోనే 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు