కృష్ణా, గోదావరి కాల్వల్లో కాలుష్య నివారణకు చర్యలు

బుధవారం, 23 అక్టోబరు 2019 (20:43 IST)
కృష్ణా, గోదావరి కాల్వల్లో రోజు, రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్‌ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు.

సుదీర్ఘ పాదయాత్రలో  కాలుష్యం కారణంగా గోదావరి, కృష్ణా కాలువల్లో నీరు కలుషితమవుతున్న తీరును స్వయంగా చూసిన ముఖ్యమంత్రి నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టారు. భూగర్భ జలాలు సైతం రోజు, రోజుకూ తీవ్రంగా కలుషితం కావడంతో పాటు వాటి దుష్పలితాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని... దీన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా, నిర్ధేశం చేశారు. 

 
కాలుష్య నియంత్రణ కోసం పనిచేస్తున్న వివిధ సంస్ధలతో కలిసి నివారణ కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతనే కాల్వల్లోకి విడిచి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గోదావరి, కృష్ణా కాల్వలలో బాగు చేయాల్సిన ప్రాంతాలు గుర్తించాలన్నారు. ఎక్కడెక్కడ మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలో కూడా గుర్తించాలన్నారు. 

కాల్వల సుందరీకరణ, చెట్ల పెంపకంపై కార్యచరణ రూపొందించాలన్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన గోదావరి, కృష్ణా కెనాల్స్‌ మిషన్‌ బాధ్యతలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం వై.యస్‌. జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. మిషన్ ఛైర్మన్ గా సీఎం వై.యస్.జగన్, వైస్ ఛైర్మన్ గా గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ (జీ.డబ్ల్యూ. ఎస్) నుంచి రాజశ్రీ వ్యవహరించనున్నారు. 

సమీక్షా సమావేశంలో కాలుష్య నివారణ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేసిన గండిపేట వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (జీ.డబ్ల్యూ.యస్‌) ప్రతినిధులను సీఎం అధికారులకు పరిచయం చేశారు. అనంతరం జీ.డబ్ల్యూ.యస్‌. ప్రతినిధులు కేరళలోని కన్నూర్‌లో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను వీడియో ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులకు వివరించారు.


అదే తరహాలో కృష్ణా, గోదావరి కాల్వల శుద్ధి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చెప్పారు. అందుకోసం ఈ సంస్ద సహాయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలోని నాలుగు కిలోమీటర్ల కృష్టా నది కాల్వను అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు