వెస్ట్ గోదావరి జిల్లా అత్తిలిలో ఓ గొర్రెల కాపరిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ వ్యక్తిని అత్తిలి నుంచి విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అత్తిలికి చెందిన కాశీ శ్రీను అనే వ్యక్తి గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. ఈయన శరీరమంతా బుడిపెలు రావడంతో మంకీపాక్స్ అయివుంటుందన్న అనుమానంతో వైద్యులు విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
జిల్లాలోని ఇరగవరం మండలానికి చెందిన శ్రీను అత్తిలిలో మటన్ దుకాణం నిర్వాహకుడి వద్ద గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. వారం క్రితం శ్రీను ఒంటిపై పలుచోట్ల పెద్ద సైజులో పొక్కులు రావడంతో స్థానిక పీఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నాడు. సోమవారం ఆయన ఒంటి నిండా బుడిపెలు రావడంతో తొలుత తణుకు ప్రభుత్వాస్పత్రికి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు మంకీపాక్స్ లక్షణాలుగా భావించి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో శ్రీను మంగళవారం ఉదయం విజయవాడ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ వైద్యులు రక్త నమూనాలు సేకరించి పుణెకు పంపించినట్లు అత్తిలి పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ కె.నాగరాజు తెలిపారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా శ్రీనుకు సోకింది మంకీ పాక్స్ లేదా ఇతర చర్మ వ్యాదా అనేది నిర్ధారణ అవుతుందని చెప్పారు.