టిటిడి ఛైర్మన్ కార్యాలయ సందేశాలే మార్ఫింగ్, తిరుమలలో దళారుల ఆటకట్టు..

గురువారం, 23 సెప్టెంబరు 2021 (20:45 IST)
తిరుమల శ్రీవారి భక్తులను నిలువు దోపిడీ చేసేందుకు దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి వచ్చిన మెసేజ్‌లను మార్ఫింగ్ చేసి భక్తులను మోసగిస్తున్న ఇద్దరు దళారులను తిరుమల పోలీసులు అరెస్టు చేశారు.
 
భువనగిరికి చెందిన 11 మంది భక్తుల వద్ద నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తామంటూ 16,500 రూపాయలకు కిషోర్, నాగరాజు అనే దళారులు బేరం కుదుర్చుకున్నారు. ముందుస్తుగా భక్తుల వద్ద నుంచి ఎనిమిది వేల రూపాయలు అడ్వాన్స్‌గా దళారులు పొందారు.
 
అయితే ఇవాళ టిటిడి ఛైర్మన్ క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్న భక్తలు ఆ మెసేజ్‌ను టిటిడి సిబ్బందికి చూపించగా ఆ మెసేజ్ ఫేక్ మెసేజ్‌గా గుర్తించి భక్తులకు తెలిపారు. దీంతో మోసపోయామని గుర్తించిన భక్తులు టిటిడి విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు.
 
భక్తుల వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించిన విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దళారులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు