ఏపీలోని అధికార వైకాపాకు మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి నరసారావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు. లోక్‌సభ సభ్యత్వంతో పాటు వైకాపా సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరుతారన్న విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. కాగా, త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలును నరసారావు పేట నుంచి గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించింది. దీనికి ఆయన నిరాకరించారు. అయినప్పటికీ పార్టీ తన వైఖరిని మార్చుకోకపోవడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
తన రాజీనామా తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూబ, పార్టీలో గత 15, 20 రోజులుగా అనిశ్చితి నెలకొంది. దీనికి తెరదించాలన్న ఉద్దేశ్యంతోనే రాజీనామా చేసినట్టు చెప్పారు. అనిశ్చితికి తాను కారణం కాదలచుకులేదని, పైగా, ఇది ఇంకా కొనసాగడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. పార్టీ శ్రేణులు ఎవరి మార్గనిర్దేశకత్వంలో వెళ్లాలనే అంశంపై గందరగోళంలో ఉన్నారని, వీటన్నింటికి సమాధానం చెప్పాలన్న ఉద్దేశ్యంతో పార్టీతో పాటు.. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు చెప్పారు.
పైగా, గత నాలుగున్నరేళ్లలో పార్టీకి, తన నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేశానని గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంతో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తుందని, దీనివల్ల అందరూ గందరగోళానికి గురవుతున్నారని చెప్పారు. దీనికి తెరదించుతూ తాను ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సహించి ఎంపీ టిక్కెట్ ఇచ్చారని, ఆయన ఆకాంక్షల మేరకు తాను పార్టీని ఉన్నత స్థాయిలో ఉంచానని తెలిపారు.