జగనన్న వదిలిన బాణం గురి ఎవరిపైకి? అన్న పార్టీని డ్యామేజ్ చేస్తుందా?

ఐవీఆర్

మంగళవారం, 16 జనవరి 2024 (20:55 IST)
కర్టెసి-ట్విట్టర్
సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ రాజకీయ మలుపు తిరిగింది. జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిలకి అనూహ్యంగా పిసిసి చీఫ్ పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అదే ఊపుతో ఏపీ పైన ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా వైఎస్సార్ కుమార్తె షర్మిలకి పగ్గాలను అందించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి అయిన వైఎస్ షర్మిల మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన పార్టీ వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. ఆ తర్వాత చకచకా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు తీసేసుకుంది. వైఎస్ షర్మిలను పిసిసి చీఫ్‌గా ప్రకటించింది.
 
ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్‌ను ఛీ కొట్టిన ఏపీ జనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర ప్రజలు పూర్తిగా దూరం పెట్టేసారు. 2014 నుంచి ఆ పార్టీ ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా ఆనవాళ్లు లేకుండా చేసేసారు ఏపీ ప్రజలు. అసలు పోటీకి దిగి ప్రజలు ముందుకు వచ్చి ఓట్లు అడిగే సాహసం చేయలేకపోయారు కాంగ్రెస్ నాయకులు. విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా నష్టపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా కాలాన్ని ఈడ్చుకొస్తున్నది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయే అన్న భావనలో ఏపీ ప్రజలున్నారు. ఈ కారణంతో ఏపీలో పట్టుమని ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి చెందిన చాలామంది నాయకులు అటు వైసిపిలోనో లేదంటే తెదేపాలోనే చేరిపోయారు.
 
ఈ రెండు పార్టీలను ఇష్టపడని వారు రాజకీయ వైరాగ్యంతో పొలం పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరికొందరు తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఐతే కాలం మారడంతో పాటు గాయం కూడా మానుతుందని, ప్రజలు పాత గాయాలు మర్చిపోయి వుంటారని కాంగ్రెస్ అనుకుంటున్నట్లు వుంది. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వున్నదనీ, దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావచ్చని ఆ పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకుగాను వైఎస్ షర్మిలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం బూస్ట్ వంటిదని అంటున్నారు.
 
అన్న జగన్ పార్టీని చెల్లి షర్మిల డ్యామేజ్ చేస్తారా?
ఇపుడు ఇదే ప్రశ్న. మొన్నటివరకూ తెలంగాణలో అంటే... కేసీఆర్ పైన విమర్శలు చేస్తూ తన సొంత పార్టీని నడిపించారు వైఎస్ షర్మిల. తాజాగా ఇపుడు ఆమె ఏపీ పిసిసి చీఫ్ అయ్యారు కనుక ఇక్కడ పరిస్థితి అలా వుండబోదు. సొంత సోదరుడి నేతృత్వంలోని ప్రభుత్వాన్నే ఎండగట్టాల్సిన పరిస్థితి నెలకొని వుంది. ఒక రకంగా ఇది కత్తి మీద సాము లాంటిది. వైఎస్సార్ చరిష్మా జగన్ మోహన్ రెడ్డికి ఎంత వున్నదో వైఎస్ షర్మిలకు కూడా అంతోఇంతో వున్నది. ప్రజల్లో ఆమెకి మంచి ఆదరణ వున్నది. వైఎస్సార్ కుమార్తెగా ఆమె ఊరూవాడా వైఎస్సార్ ఫోటోలతో నింపేసే పని తప్పక చేస్తారు. దీనితో వైఎస్సార్ ఫోటోను వాడుకుంటున్న వైసిపి నాయకులకి అయోమయ పరిస్థితి ఏర్పడవచ్చు.

పైగా విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ గత ముఖ్యమంత్రి వైఎస్సార్ కనుక ఆయన చేసిన పనులు, ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ కాంగ్రెస్ పార్టీవేనన్న ప్రచారం వైఎస్ షర్మిల చేయవచ్చు. ఆ ప్రకారంగా అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి తనవంతు డ్యామేజ్ చేసే అవకాశం వుంది. ఇక వైఎస్ అభిమానులలో సైతం చీలిక ఏర్పడవచ్చు. అలా కొన్ని ఓట్లు చీలిక జరిగే పరిస్థి తలెత్తక తప్పదు. ఇలా చూస్తే ఇప్పుడున్న పరిస్థితికి మించి వైసిపి మరింత దిగజారిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో వైసిపికి, పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ద్వారా భారీ దెబ్బ తగలవచ్చు.
 
కర్టెసి-ట్విట్టర్
తెదేపా-జనసేనకి ప్లస్సా మైనస్సా?
ఇప్పటికే రెట్టించిన ఉత్సాహంతో వుంది తెదేపా-జనసేన కూటమి. పలు సర్వేలు వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమిదే అధికారం అంటూ చెబుతున్నాయి. 175 అసెంబ్లీ సీట్లకి గాను కనీసం 90కి పైగా ఆ కూటమి కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు. ఈ సర్వే లెక్కలు షర్మిలకి పీసీసీ చీఫ్ పదవి రాకమునుపు. ఇపుడు సమీకరణాలు మారిపోయే అవకాశం వుంది. ఐతే ఆ సమీకరణాలన్నీ తమకే అనుకూలంగా వుంటాయని తెదేపా-జనసేన కూటమి నాయకులు అంటున్నారు. ఇటీవలే వైఎస్ షర్మిల ప్రత్యేకంగా తెదేపా యువనేత నారా లోకేష్‌కి క్రిస్మస్ విషెస్ తెలిపారు. అలాగే లోకేష్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన కుమారుడి పెండ్లికి రావాలంటూ నేరుగా తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడిని స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించారు వైఎస్ షర్మిల. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.
 
ఐతే తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చిన ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వస్తున్నాయి. షర్మిల-జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక ఇచ్చారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇటీవలే సీఎం జగన్... రాజకీయ లబ్ది కోసం కుటుంబాలనే చీల్చుతారంటూ ప్రకటించారు. కనుక ఈ విషయం ఆయనకు ముందే తెలిసిపోయిందని అనుకోవచ్చు. మొత్తమ్మీద చూస్తే ఈసారి ఎన్నికలు పాలక పార్టీ వైసిపికి పెనుసవాలుగా మారనున్నాయి. మరి ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది వేచి చూడాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు