ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఎంతోమంది తిరుపతిలో ఉండిపోయారు. అయితే నేటి నుంచి ఇస్తున్న టోకెన్లు తిరుపతి, తిరుమలలోని స్థానికులకు మాత్రమేనని చెప్పారు. దీంతో స్థానికేతరులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కానీ వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే వచ్చిన భక్తులకు టోకెన్లు ఇవ్వకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని.. వారు ఆందోళనకు దిగే అవకాశముందని భావించారు టిటిడి ఉన్నతాధికారులు.
దీంతో అర్థరాత్రి నుంచే వారికి కూడా టోకెన్లను కేటాయించారు. రోజుకు 10 వేల టోకెన్ల లెక్కన పదిరోజుల పాటు లక్ష టోకెన్లను ఇస్తామని టిటిడి మొదట్లో చెప్పింది. కానీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒకేరోజు టోకెన్లను ఇచ్చేస్తోంది. ఇప్పటి వరకు 60 వేలకు పైగా టోకెన్లను ఒకేరోజు భక్తులు పొందారు. టైమ్ స్లాట్ బట్టి రేపటి నుంచి జనవరి 3వ తేదీ వరకు భక్తులు శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్సించుకోవచ్చు.