తమ్ముడు గెలుపు కోసం సైన్యంతో కలిసి పని చేస్తా : నాగబాబు

మంగళవారం, 12 మార్చి 2019 (09:51 IST)
తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒంటరివాడే కావొచ్చు... కానీ ఆయన వెనుక కోట్లాది మంది జనసైనికులు ఉన్నారని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. వారితో కలిసి తన సోదరుడు గెలుపు కోసం పని చేస్తానని నాగబాబు చెప్పారు. 
 
ఇటీవల గుంటూరులో మెగా, పవన్ అభిమానులతో నాగబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన సోదరుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఒంటరివాడే అయినప్పటికీ, ఎన్నికలను ఎదుర్కొనేందుకు కావాల్సినంత సైన్యం అభిమానుల రూపంలో మెండుగా ఉందన్నారు. 
 
పవన్ గెలుపు కోసం జన సైనికులతో కలిసి తాను పని చేస్తానని చెప్పారు. అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి బుద్ధి చెప్పి, జనసేనను అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో అధికారం కులాల మధ్య కూరుకుపోయిందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిస్థితి పోవాలని, అది జరగాలంటే, పవన్ కల్యాణ్ అధికారంలోకి రావాలని అన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ ప్రజలకు దూరమైందని, తన కుమారుడు లోకేశ్ ను సీఎంగా చేసే లక్ష్యంతోనే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం తనవంతు కృషి చేస్తానని నాగబాబు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు