దేశంలో మాతృభాష పరిరక్షణకు మాతృమూర్తులందరూ నడుం బిగించాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో తనను కలిసిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వారి సతీమణి శ్రీమతి ఉషా నాయుడు మాటామంతీ సాగించారు. మాతృభాషను అందరూ ప్రోత్సహించాలని, తప్పనిసరిగా ప్రతివారు వారి సంతానానికి మాతృభాషను నేర్పాలని అన్నారు. ఆంగ్ల భాషకు తాను వ్యతిరేకం కాదని కాని మాతృభాష నేర్చుకున్న తర్వాతనే ఇతర భాషలను నేర్చుకోవాలని అన్నారు. మాతృభాష కళ్ళవంటివైతే, ఆంగ్లభాష కళ్ళద్దాల వంటిదని అన్నారు. తెలుగు రాష్ట్రాలు రెండూ పదవ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చెయ్యడం హర్షణీయమని, మనం కూడా చిత్తశుద్ధితో మాతృభాషపై మక్కువ చూపి ముందుకు పోవాలని కోరారు.
మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, ఆది కాలం నుండి వేదకాలం నుండి పుణ్యకాలం నుండి పురాణకాలం నుండి మన పూర్వీకులు మనకు అందిచిన సంస్కృతిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. పురాణాలలో మహిళలలకు ఎంతో గుర్తింపు ఇవ్వబడిందని, మన దేశంలోని నదుల పేర్లు కూడా మహిళల పేర్లపైనే ఉన్నాయని గుర్తు చేశారు. మనమందరమూ మహిళలకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించి ముందుకు పంపితే వారు సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. మహిళా రిజర్వేషన్లు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని, కాని కేవలం రిజర్వేషన్లు కల్పించినంత మాత్రాన సమస్య సమసిపోదని తెలిపారు. దానికి చిత్తశుద్ధి అవసరమని, ప్రతి ఒక్కరు మహిళలకు అవకాశాలను కల్పించడంలోను, వారిని ప్రోత్సహించడంలోను చిత్తశుద్ధి పాటించాలని అన్నారు. దీనికి బిల్లుతోపాటు రాజకీయ చిత్తశుద్ధి మరియు పరిపాలనా చిత్తశుద్ధి కావాలని అన్నారు.
దేశ ప్రగతికి చదువు చాలా అవసరమని, ప్రతి బాలిక తప్పనిసరిగా చదువుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చదువే మనల్ని ముందుకు తీసుకుపోతుందని, మహిళలందరూ వారి పిల్లలకు ఉత్తమమైన విద్యాబుద్ధులు నేర్పించాలని కోరారు. అలాగే మహిళలకు ఆర్ధిక స్వావలంబన చాలా అవసరమని, వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని అన్నారు. ఇలా జరిగినప్పుడు మహిళలు స్వశక్తితో వారికాళ్ళపై వారు నిలబడగలుగుతారని అన్నారు. దీనికి ఉదాహరణగా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో స్వర్ణభారత్ ట్రస్ట్ గ్రామీణ మహిళలకు, బాలికలకు కుట్టుపని, అల్లికలు, ఎంబ్రాయిడరీ వంటి చిన్న పనులు నేర్పించడం, కౌశల్యశిక్షణ ఇవ్వడం ద్వారా వారికి స్వయం ఉపాధి లభించుచున్నదని, స్వావలంబన లక్ష్యంగా మహిళలు శిక్షణ పొందుతున్నారని అన్నారు. తర్వాత వారికి వివిధ రంగాలలో బ్యాంకులు లేదా ఇతర ఆర్ధిక సంస్థల ద్వారా ఋణాలు ఇప్పించంతో వారు స్వంతంగా పనులు చేసుకుని సంపాదించడంతో పురుషులకు చేయూతగా నిలబడుతున్నారని అన్నారు. వరకట్న నిర్మూలనలో కూడా మహిళల పాత్ర ప్రధానంగా ఉన్నదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి గారు మరియు వారి సతీమణి తమ విలువైన సమయాన్ని కేటాయించి తమతో గడిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. వారు తమతో సంభాషించడం చాలా సంతోషంగా ఉందని, వారు చేసిన సూచనలు మరియు సలహాలు తమనెంతో ఉత్తేజపరిచాయని, మహిళలందరూ తప్పనిసరిగా వాటిని పాటించి మహిళా స్వావలంబన కోసం కృషి చేస్తామని అన్నారు.