వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

వరుణ్

సోమవారం, 17 జూన్ 2024 (13:27 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుషికొండపై ప్రజాధనంతో నిర్మించుకున్న రాజప్రసాదానికి సంబంధించి బయటకు రావాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయని ఏపీ విద్యా శాఖామంత్రి నారా లోకేశ్ అన్నారు. బక్రీద్ పండుగ సంర్భంగా మంగళగిరిలోని ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే వంద రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు ఫుల్‌స్టాప్ పెడతామని స్పష్టం చేశారు. 
 
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముగ్గురు టీడీపీ కార్యకర్తలను వైకాపా నేతలు హత్య చేసినా సంయమనం పాటిస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని చెప్పారు. తమ కార్యకర్తలకు ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్లు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలన్నారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
 
మరోవైపు, మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. గత రెండు రోజులుగా ఆయన ప్రజా దర్బార్‌ పేరిట ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. సోమవారం కూడా నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివచ్చి తమ సమస్యలను లోకేశ్‌ దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి కల్పించాలని నిరుద్యోగులు ఆయనకు విన్నవించారు. 
 
విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైకాపా నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. అందరి సమస్యలను ఓపికగా ఆలకించిన లోకేశ్‌... సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతామంటూ వారికి భరోసా ఇచ్చి పంపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు