ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతికార చర్యలకు దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు, మరో ప్రైవేట్ సర్వీసులకు మావోలు నిప్పంటించారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగ్దల్‌పూర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. సుకుమా జిల్లా దోర్నపాల్ కుత్తి గ్రామ సమీపంలో మావోయిస్టులు అడ్డుకుని, ప్రయాణికులను కిందకు దించేశారు. ఆ తర్వాత బస్సు డీజిల్ ట్యాంక్‌ను పగులగొట్టి, ఆయిల్‌ను బస్సులో చల్లి నిప్పంటించారు.
అలాగే, ప్రయాణికులు చూస్తుండగానే ఒకరిని కాల్చి చంపారు. మృతుడు కానిస్టేబుల్‌గా భావిస్తున్నారు. ఇదే దారి నుంచి వెళ్తున్న మరో ప్రైవేటు బస్సు, ఒక ట్రాక్టర్‌ను కూడా దహనం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఈ నెల ఒకటో తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ, ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్లు సమీపంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపునకు చేరుకున్నట్లు సమాచారం.